సౌదీలో గుండెపోటుతో వలస జీవి మృతి
ధర్మపురి: జీవనోపాధి కోసం సౌదీ వెళ్లిన ఓ వలస జీవి అక్కడే గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని జైనా గ్రామంలో విషాదం నింపింది. స్థానికుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన కోడూరి నారాయణ (53) 13ఏళ్లుగా సౌదీ వెళ్తున్నాడు. అక్కడ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 13న పనులు చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. నారాయణకు భార్య సత్తవ్వ, కొడుకు వెంకటేశ్, కూతురు ఉన్నారు. కొడుకు కూడా ఏడాది క్రితం ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. తండ్రి మరణవార్త తెలియగానే స్వగ్రామానికి చేరుకున్నాడు. నారాయణ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
● నేత్రాలు దానం చేసిన కుటుంబ సభ్యులు
జగిత్యాల క్రైం: జగిత్యాలలోని తులసీనగర్‌కు చెందిన పసులేటి సాయిరోషన్ (15) మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిరోషన్ జగిత్యాలలోని పురాతన పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం రోషన్ తలనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు వైద్యుల సూచనల మెరకు బ్రెయిన్ సర్జరీ చేయించారు. అయినా తలనొప్పి తగ్గలేదు. తిరిగి నొప్పి రావడంతో మరోసారి సర్జరీ చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి కృష్ణవేని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ మోహన్ తెలిపారు. రోషన్ నేత్రాలను ఎల్‌వీ.ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు.
పే..ద్ద కొండచిలువ
కమాన్‌పూర్(మంథని): స్థానిక ఎక్స్‌రోడ్డు వద్ద మంగళవారం కొండచిలువ ప్రత్యక్షమైంది. రహదారి సమీపంలోని కామెర నర్సయ్య ఇంటి వద్ద కొండచిలువ సంచరిస్తుండగా చూసిన నర్సయ్య.. కల్వచర్ల కు చెందిన పాలు పట్టే శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన చేరుకుని కొండచిలువను పట్టుకున్నాడు. ఆ తర్వాత రామగిరి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదివేసినట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment