వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య
ములుగు: జిల్లాకేంద్రంలోని బండారుపల్లి రోడ్డు ఓపెన్ ప్లాట్లలో ఈనెల 21వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓర్సు శ్రీను(37) కేసును పోలీసులు ఛేదించారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని పథకం ప్రకారం శ్రీనును హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓర్సు శ్రీను తన భార్య స్వప్నతో కలిసి హనుమకొండలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్వప్న తన స్వగ్రామం హసన్‌పర్తి మండలం మడిపల్లికి చెందిన బుర్ర సంతోష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, తరచూ మద్యం తాగొచ్చి వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో భర్తను హత్య చేయడానికి ప్లాన్ వేసింది. అనుకున్నదే తడువుగా సంతోష్‌కు రూ.30వేలు ఇవ్వగా అతడు తనకు తెలిసిన నడికుడ మండలం కంఠాత్మకూర్‌కు చెందిన ఆకుల అనిల్, బెల్లంకొండ చంద్రమోహన్‌తో కలిసి మేడారం వెళ్లడానికి ప్లాన్ చేశాడు. అయితే వీరితోపాటు మనం కూడా మేడారం వెళ్దామని స్వప్న తన భర్త శ్రీనును ఒప్పించింది. దీంతో 21వ తేదీ రాత్రి శ్రీను, స్వప్న, అనిల్, చంద్రమోహన్ ఆటోలో, సంతోష్ కారులో బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటలకు ములుగు సమీపంలో బండారుపల్లి రోడ్డు పక్కన ఉన్న ఓపెన్ ప్లాట్లకు తీసుకెళ్లి ప్లాన్ ప్రకారం శ్రీనుకు మద్యం తాగించారు. అనంతరం గొడవపడి రాయితో తలపై బలంగా కొట్టారు. దీంతో శ్రీను అక్కడికక్కడే చనిపోయాడు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఘటనా స్థలి నుంచి పరారయ్యారు. మరుసటిరోజు సమాచారం అందుకున్న పోలీసులు.. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో పస్రా సీఐ రవీందర్, ములుగు ఎస్సైలు వెంకటేశ్వర్‌రావు, లక్ష్మారెడ్డి నేతృత్వంలోని మూడు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీ ద్వారా ఆ రోజు రాత్రి వాహనాల కదలికలు గమనించారు. ఈ క్రమంలో మంగళవారం ములుగు మండలం గట్టమ్మ సమీపంలో నిందితులు స్వప్న, సంతోష్, అనిల్, చంద్రమోహన్‌ను అదుపులోకి తీసుకుని విచారింగా నేరం ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి కారు, ఆటో, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment