సాగునీటి కోసం రైతు ఆత్మహత్యాయత్నం
● అడ్డుకున్న పోలీసులు
మంథని: సోలార్ వవర్ ప్లాంట్ ఏర్పాటుతో నీళ్లు అందక పంటలు నష్టపోతున్న తమకు న్యాయం చేయాలని పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామానికి చెందిన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఎస్సారెస్పీ కాలువ పరిధిలోని ఎల్–6 కాలువను ఆక్రమించి పోతారంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారని, దీనిద్వారా పంటలకు సాగునీరు రావడం లేదని ఆవేదన చెందారు. ఈ విషయంపై పలుమార్లు అధికారుల ఎదుట తమగోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. దీంతో తాము హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని, కాలువను పునరుద్ధరించాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసిందని వారు గుర్తుచేశారు. అయినా, సోలార్ పవర్ ప్లాంట్ కంపెనీ నిర్వాహకులు కోర్టు ఆదేశాలు పట్టించుకోవడం లేదని ఆరోఇంచారు. తద్వారా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న క్రమంలో ఓ యువ రైతు పురుగుల మందు డబ్బా పట్టుకొని మందు తాగేందుకు యత్నించాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు రైతును అడ్డుకొన్నారు. ఆ తర్వాత ఆయనను అదుపులోకి తీసుకుని సర్దిచెప్పడంతో శాంతించాడు. ఈ విషయంపై నీటిపారుదల శాఖ అధికారులతో పోలీసులు ఫోన్‌తో మాట్లాడారు. హైకోర్టు తీర్పు ఆధారంగా కాలువను 20 రోజుల్లో పునరుద్దరిస్తామని ప్లాంట్ సైట్ ఇన్‌చార్జి చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment