ప్రొటోకాల్ చిచ్చు
● కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ● అధిపత్యం కోసం నేతల ఆరాటం ● తనకు గౌరవం ఇవ్వడం లేదని పార్లమెంటు సభ్యుడి వ్యాఖ్య ● వంశీకృష్ణ, ఎమ్మెల్యేల మధ్య పెరుగుతున్న అంతరం
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రొటోకాల్ చిచ్చుతో పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి. తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, చట్టసభ సభ్యుడిగా గుర్తించటం లేదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం కాంగ్రెస్ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. అగ్రకుల మైండ్ సెట్‌తో కుల, మతపిచ్చి తో పనిచేస్తే సమాజం ముందుకు పోదని ఎంపీ తాజాగా చేసిన వ్యాఖ్యలతో కొద్దిరోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత, ఆధిపత్య కుమ్ములాట ఒక్కసారిగా బహిర్గతమైంది.
అందరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులే..
పెద్దపల్లి(ఎస్సీ) పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచిన ఏడుగురూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. అందులో చెన్నూరు నుంచి వంశీకృష్ణ తండ్రి వివేక్, బెల్లంపల్లి నుంచి పెద్దనాన్న వినోద్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాకా వారసుడి(మనవడి)గా గడ్డం వంశీకృష్ణ ఎంపీగా గెలుపొందారు. అప్పటినుంచి చెన్నూరు, బెల్లంపల్లి మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయనకు ప్రాతినిధ్యం దక్కడం లేదని, పార్టీ కార్యకలాపాలు, అభివృద్ధి పనులకు కూడా ఆహ్వానించడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. శిలాఫలాకాల్లోనూ తన పేరు ఉండటం లేదని ఆవేదన చెందడం కాంగ్రెస్ శ్రేణుల్లో ముదురుతున్న అసంతృప్తిపై చర్చకు దారితీస్తోంది.
గతంలో ఎంపీలకు సైతం..
గత పదేళ్లలో పెద్దపల్లి ఎంపీలుగా ఎన్నికై న బాల్క సుమన్, వెంకటేశ్ నేత బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే, స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనుమతి లేనిదే వారు తమ నియోజకవర్గంలో పర్యటించలేని పరిస్థితి నెలకొని ఉండేది. ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తేనే ఎంపీలు హాజరయ్యేవారు. కేసీఆర్ సైతం ఎమ్మెల్యేలనే నియోజకవర్గాలకు బాస్‌లు గుర్తించడంతో ఎంపీలు నామత్రంగానే మారిపోయారు. ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టకుండా ఎంపీలను కట్టడి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం బీఆర్‌ఎస్ బాటలోనే పయనించడంతో ప్రొటోకాల్ వివాదం తలెత్తుతోందని విశ్లేషకులు అంటున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వంశీకృష్ణ కుటుంబ జోక్యంతో గ్రూప్‌లు పెరుగుతాయని, గతంలో ఇలా గే గ్రూప్‌లు కట్టి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నష్టం చేశారని ఎమ్మెల్యేల వర్గీయులు అంటున్నారు. వంశీకృష్ణ విషయంలో ఎమ్మెల్యేల వ్యవ హార శైలి కరెక్టే అనే వాదన కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది.
కలెక్టర్ కులపిచ్చితో పని చేస్తుండు..
పెద్దపల్లి ప్రజల గుండెల్లో కాకా(మాజీమంత్రి జి.వెంకటస్వామి) ఉన్నారని, ఇతర జిల్లాల్లో వర్ధంతి నిర్వహించగా, ప్రభుత్వ జీవో ఉన్నా పెద్దపల్లిలో వర్ధంతి నిర్వహించకపోవడం బా ధాకరమని వంశీకృష్ణ మీడియాతో అన్నారు. అగ్రకుల మైండ్ సెట్, కుల పిచ్చితో పనిచేస్తు న్న కలెక్టర్‌కు నీతిపాఠం తెలియజేయాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. ఇది కాకాకు జరిగిన అవమానం కాదని, యావత్ దళితులకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. ప్రివిలేజ్ మోషన్ ద్వారా లోక్‌సభ స్పీకర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఎంపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు భూషణవేన రమేశ్‌గౌడ్, నల్లాల కనకరాజు, సజ్జాద్, పునుకొండ శ్రీధర్, బండారి సునీల్, గంగుల సంతోష్, మానమాండ్ల శ్రీనివాస్, కొలిపాక సంపత్, కీర్తి రాజయ్య పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పాటించినా.. పాటించకపోయినా.. అభివృద్ధి కార్యక్రమాలకు పిలిచినా.. పిలవకపోయినా.. నేను వస్తా.
– సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో పెద్దపల్లిలో ఇటీవల నిర్వహించిన యువ వికాసం సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అసహనం.
ప్రొటోకాల్ పాటించటం లేదు.. ఇది ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు చేయిస్తున్నారో.. నేను ఎంపీని. నేమ్ ప్లేట్‌లో నా పేరు లేదు.. అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు.. నన్ను ఎన్నుకున్న ప్రజల కోసమే పనిచేస్తున్న.. ఈరోజు కూడా అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి. కానీ, నాకు ఇన్విటేషన్ రాలేదు.. ఇద్దరమూ యంగ్‌గానే ఉన్నాం.. మంచిగా పనిచేస్తామంటే కుదరడం లేదు.. కలెక్టర్ ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.
– మంగళవారం కలెక్టర్, ఎమ్మెల్యేలపై
ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆగ్రహం.
Comments
Please login to add a commentAdd a comment