హమాలీల సమ్మె ఉధృతం
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి, మంథని, సుల్తాబాద్‌లోని మండల లెవల్ స్టాక్(ఎంఎల్‌ఎస్) పాయింట్లలో పనిచేసే హమాలీల సమ్మెతో జిల్లావ్యాప్తంగా రేషన్ సరుకుల సరఫరా నిలిచిపోయింది. జిల్లా పౌర సరఫరాల శాఖ ఇక్కడి నుంచే జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు సరుకులు పంపిణీ చేస్తోంది. అయితే, తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో హమాలీలు ఈనెల ఒకటో తేదీ నుంచి విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. దీంతో చౌకధరలు దుకాణాలకు బియ్యం సరఫరా పాక్షికంగా నిలిచిపోయింది.
సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథనిలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు
జిల్లాలోని సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథనిలో మండల లెవెల్ స్టాక్ పాయింట్లు(ఎంఎల్‌ఎస్) ఉన్నాయి. తెల్లరేషన్‌కార్డులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఇక్కడి నుంచే బియ్యం సరఫరా చేస్తారు. అంతేకాదు.. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచే బియ్యం తరలిస్తారు. హమాలీల సమ్మెతో కొన్నిగ్రామాలకు పాక్షికంగానే బియ్యం సరఫరా అయిందని గోదాం ఇన్‌చార్జిలు చెబుతున్నారు.
480 రేషన్ షాపులు..
జిల్లాలో మొత్తం 480 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 3,400 టన్నులు రేషన్ బియ్యం వీటి ద్వారా పంపిణీ చేస్తున్నామని సివిల్ సప్లయి మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. గోదాముల్లోంచి లారీల్లో బియ్యం లోడ్ చేసుకుని గ్రామాలు, పట్టణాలు, నగరంలోని రేషన్ షాపులకు తరలిస్తున్నారు. అయితే, లారీల్లో లోడింగ్, అన్‌లోడ్ చేయాల్సిన హమాలీలు సమ్మె చేయడంతో బియ్యం సరఫరా తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు.
కూలి సవరణలో నిర్లక్ష్యం
ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యాన్ని గోదాముల్లోకి అన్‌లోడ్ చేయడం, ఇక్కడి నుంచి రేషన్ దుకాణాలకు పంపించేందుకు లోడ్ చేయడంలో హమాలీలు అత్యంత కీలం. వీరికి రెండేళ్లకోసారి కూలి సవరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వారి కూలి రేట్లు పెంచుతున్నట్లు పౌర సరఫరాల కమిషనర్ రెండు నెలల క్రితం జీవో విడుదల చేశారు. కానీ, అది నేటికీ అమలు చేయడం లేదు. ఇందుకు అవసరమైన నిధులు కూడా విడుదల చేయడంలేదని హమాలీ నాయకులు చెబుతున్నారు. ఫలితంగా జనవరి 2024 నుంచి కూలి రెట్లు అమలు చేస్తామని చెప్పినా నేటికీ ఆచరణలోకి రావడం లేదని, దీంతోనే తాము సమ్మె చేయాల్సి వస్తోందని హమాలీలు, నాయకులు వివరిస్తున్నారు.
సమ్మె కొనసాగిస్తాం
మా సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె కొనసాగిస్తాం. బియ్యం బస్తాలతో లారీల్లోకి ఎక్కడం, దిగడంతో కాళ్లు, కీళ్లనొప్పులు వస్తున్నాయి. ఒక క్వింటాలుకు కూలి రేటు రూ.35 చెల్లించాలి. మిగతా సమస్యలూ పరిష్కరించాలి.
– మైలారం తిరుపతి, హమాలీ సంఘం నేత, సుల్తానాబాద్
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా
గోదాముల్లోని హమాలీలు చేస్తున్న సమ్మె విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. త్వరలోనే రేషన్ షాపులకు బియ్యం చేరుతాయి.
– శ్రీకాంత్‌రెడ్డి, డీఎం, సివిల్ సప్లయ్
నిలిచిన లారీలు.. ఆగిన రేషన్ సరఫరా
మూడురోజులుగా విధులకు కార్మికుల గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment