‘క్రీడలతో స్నేహభావం’
సుల్తానాబాద్(పెద్దపల్లి): క్రీడా పోటీలతో స్నేహభావం పెంపొందుతుందని మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి గణేశ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన పోటీలను జడ్జి ప్రారంభించి మాట్లాడారు. నిత్యం విధుల్లో ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసం, నూతనోత్తేజం కలిగిస్తాయని జడ్జి అన్నారు. కాగా, న్యాయవాదుల జట్టుపై పోలీసు జట్టు విజయం సాధించింది. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు శ్రవణ్‌కుమార్, సనత్ కుమార్, లక్ష్మణ్‌రావు, వెంకటేశ్, సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములుగౌడ్, కార్యదర్శి జోగుల రమేశ్, ఏజీపీ ఆంజనేయులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఉత్కంఠగా సాగిన పోలీసు క్రీడాపోటీలు
గోదావరిఖని: కాళేశ్వరం జోన్‌స్థాయి పోలీసుల క్రీడాపోటీలు స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టే డియంలో ఆదివారం ప్రారంభమైయ్యాయి. అ డిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామగుండం పోలీస్ కమిషనరేట్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్ జ ట్లు పాల్గొంటున్నాయి. రెండు రోజులపాటు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో షటిల్ బ్యా డ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్, టగ్‌ఆఫ్‌వార్, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, జావలిన్‌త్రో, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడల్లో సత్తాచాటిన పోలీసు క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ప్రారంభ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్‌రావు, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్‌లో సోమవారం(ఈనెల 20వ తేదీన) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాల సర్వే క్షేత్రస్థాయిలో కొనసాగుతోందని, దాని పర్యవేక్షణకు అధికారులు క్షేత్రస్థాయి లో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. దీంతోనే ప్రజావాణిని రద్దు చేస్తున్నామని, జిల్లావాసులు రావొద్దని ఆయన సూచించారు.
జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోండి
కోల్‌సిటీ(రామగుండం): కొత్తరేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకాల అర్హుల ఎంపిక కోసం ఈనెల 21 – 23వ తేదీ వరకు వార్డుసభలు నిర్వహిస్తామని రామగుండం బల్దియా కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ తెలిపారు. జాబితాలో పేర్లు లేనివారు వార్డుసభల్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుటుంబ యజమాని, కుటుంబసభ్యుల పేర్లు, ఆధార్ నంబర్, చిరునామా, మొబైల్ నంబరుతో దరఖాస్తు చేయాలన్నారు.
వార్డు సభలు ఇలా..
21వ తేదీ ఉదయం : 1, 2, 11, 12, 21, 22, 31, 32, 41, 42వ డివిజన్లు.
మధ్యాహ్నం : 3, 4, 13, 14, 23, 24, 33, 34, 43, 44వ డివిజన్లు.
22న ఉదయం : 5, 6, 15, 16, 25, 26, 35, 36, 45, 46వ డివిజన్.
మధ్యాహ్నం : 7, 8, 17,18, 27, 28, 37, 38, 47, 48 డివిజన్లు
23న ఉదయం : 9, 19, 29, 39, 49వ డివిజన్లు.
మధ్యాహ్నం: 10, 20, 30, 40, 50వ డివిజన్లు.
క్రీడాపోటీలకు ఆహ్వానం
పెద్దపల్లిరూరల్: రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనాలనుకునే జిల్లాకు చెందిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు ఈనెల 21వ తేదీలోగా తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి సురేశ్ కోరారు. పేర్లు నమోదు చేసుకున్న వారు ఈనెల 23, 24వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరు కావాలని సూ చించారు. అందుకు సంబంధించి రవాణా, భోజన ఖర్చు క్రీడాకారులే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తమ ఐడీ, ఆధార్‌కార్డు జిరాక్స్ సమర్పించాలన్నారు.
నేటినుంచి ఆర్టిజన్ల రిలే దీక్షలు
పెద్దపల్లిరూరల్: తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి జిల్లా కేంద్రంలో రిలేదీక్షలు చేపడుతున్నట్లు జేఏఏసీ జిల్లా చైర్మన్ కిషన్‌రెడ్డి తెలిపారు. జేఎల్‌ఎం, సబ్ ఇంజినీర్ పోస్టులు భర్తీ చేయాలని, అర్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment