‘చెత్త’గుండం
కోల్‌సిటీ(రామగుండం): చెత్తసేకరణలో దేశంలోనే ఒకప్పుడు ఆదర్శంగా నిలిచిన రామగుండం నగరపాలక సంస్థ ఇప్పుడు చెత్త కష్టాలు ఎదుర్కొంటోంది. కీలకమైన డంపింగ్ యార్డుకు స్థలం లేకపోవడంతో చెత్త నిర్వహణ అటకెక్కింది. ఎంతో శ్రమించి ఇంటింటి నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్తను పోసేందుకు డంపింగ్‌యార్డు లేకపోవడంతో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ కుప్పలుగా పోయాల్సిన పరిస్థితులు తలెత్తున్నాయి. దీంతో కలెక్టర్, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ జోక్యం మేరకు స్పందించిన సింగరేణి సంస్థ డంపింగ్ యార్డు కోసం మూతపడిన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్(ఓసీపీ)–4 ప్రాంతంలో సుమారు 10 ఎకరాల స్థలం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో బల్దియా అధికారులు 15 రోజులుగా ఈ స్థలాన్ని డంపింగ్‌యార్డుకు అనుకూలంగా మార్చేందుకు చదును చేస్తున్నారు. సమీపంలోని మేడిపల్లి ప్రాంతవాసులు మాత్రం డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం పనులు కూడా అడ్డుకున్నారు. విరమించుకోకుంటే జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అడుగడుగునా.. ఆటంకాలే..
● నగరపాలక సంస్థలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు తరుచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. 20 ఏళ్లుగా శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటు చేయలేకపోతున్నారు.
● పదేళ్ల క్రితం రామగుండంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి అవపరమైన యంత్రాలు సమకూర్చి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించా రు. కానీ చెత్తపోయడాన్ని స్థానికులు అడ్డుకోవ డంతోపాటు చెత్తను తరలించిన డ్రైవర్లపై దాడులకు పాల్పడిన సంఘటనలతో నిలిచింది.
● గతంలో సింగరేణి సంస్థ జల్లారం శివారులో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలోనే కొంత కాలం గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సింగరేణి, ఎన్టీపీసీ ప్రాంతాల నుంచి చెత్తను తరలించారు. ఆ తర్వాత ఓసీపీ–5 ప్రాజెక్ట్ ఏర్పాటు కావడంతో, ప్రత్యామ్నాంయంగా మరో చోట స్థలం కేటాయిస్తామని చెప్పిన సింగరేణి డంపింగ్ యార్డు స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. స్థలం కేటాయింపు జాప్యం కావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
● పీకే రామయ్య కాలనీ సమీపంలోని రాముని గుండాలగుట్ట వద్ద క్వారీల స్థలాన్ని రెవెన్యూ అధికారులు డంపింగ్‌యార్డుకు సూచించా రు. ఆ ప్రాంతవాసులు అడ్డుకోగా నిలిచింది.
● లక్ష్మీపురం సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు చెందిన ఖాళీ స్థలంలో చెత్తను డంప్ చేయగా, స్థాని క ప్రజాప్రతినిధులతో పాటు సమీప ప్రాంతవాసులు వ్యతిరేకిస్తూ అడ్డుకోవడంతో ఆగింది.
● గత్యంతరం లేక గోదావరి ఒడ్డున సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతంతో పాటు హిందూ స్మశాన వాటికకు వెళ్లే దారిలో రోడ్డు ప్రక్కన చెత్తను కుప్పలుగా పోసి కాల్చివేశారు. తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చెత్త తరలింపును నిలిపేశారు.
● గోదావరి ఒడ్డున ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు చెందిన స్థలాన్ని ఇటీవల కాలంలో డంపింగ్ యార్డు కు ఉపయోగిస్తున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థ అధికారులు తొలుత చెత్త వాహనాలు రాకు ండా రోడ్డుకు అడ్డంగా స్తంభాలు పాతి హె చ్చరిక బోర్డు పెట్టారు. ప్రస్తుతం అధికారుల చొరవతో ఈ స్థలంలోనే చెత్త పోస్తున్నారు.
● తాజాగా మూసివేసిన ఓసీపీ–4 ప్రాజెక్టు స్థలాన్ని డింపింగ్ యార్డుకు ఉపయోగించుకోవచ్చని సింగరేణి యాజమాన్యం గ్రీన్‌సిగ్న ల్ ఇచ్చింది. 15 రోజులుగా ఆ స్థలాన్ని జేసీ బీ వాహనంతో అధికారులు చదును చేయిస్తున్నారు. కార్పొరేటర్లతో పాటు సమీప ప్రాంతవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రామగుండం బల్దియా సమాచారం
డివిజన్‌లు: 50
వైశాల్యం: 93.87 చదరపు కిలోమీటర్లు
జనాభా: 2,29,644(2011జనాభా లెక్కల ప్రకారం)
మొత్తం నివాసాలు: 64వేలు
పారిశుధ్య కార్మికులు: 448 మంది
ర్యాగ్ పిక్కర్లు: 100 మంది
రోజూ వెలువడే చెత్త: 118 మెట్రిక్ టన్నులు
చెత్త సేకరణకు: 53 ఆటో ట్రాలీలు
చెత్త సేకరించే ట్రాక్టర్లు: 19
అత్యాధునిక వాహనాలు: రూ.6కోట్ల విలువైనవి
రామగుండం బల్దియాకు తలనొప్పి
డంపింగ్ యార్డుకు అడుగడుగునా ఆటంకాలు
ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అదే డంపింగ్ యార్డు
తాజాగా ఓసీపీ–4 ప్రాంత స్థలం కేటాయింపు
అడ్డుకుంటున్న సమీప కార్పొరేటర్లు, ప్రాంతవాసులు
ప్రయత్నాలు విరమించుకోవాలి
ఓసీపీ–4 ప్రాంతాన్ని డంపింగ్‌యార్డుగా చేస్తున్న ప్ర యత్నాలు విరమించుకోవాలి. లేకుంటే మేడిపల్లి, మల్కాపూర్, జంగాలపల్లి గ్రామప్రజలతో కలిసి జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మేడిపల్లి ఓపెన్‌కాస్టుతో నరకయాతకు గురయ్యాం. ఇప్పుడు డంపింగ్‌యార్డుతో దుర్వాసన పెరగంతో పాటు కాలుష్యం వెదజల్లుతోంది.
– కుమ్మరి శ్రీనివాస్, 3వ డివిజన్ కార్పొరేటర్
ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
ఓసీపీ–4 ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డుతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. డంపింగ్‌యార్డు చెత్తతో బయో మైనింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. డీఆర్‌సీసీ సెంటర్ పెడుతాం. తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ అక్కడే నిర్వహించి, చెత్తతో సేంద్రియ ఎరువు కూడా తయారు చేయిస్తాం.
– జె.అరుణశ్రీ,అడిషనల్ కలెక్టర్(లోకల్‌బాడీస్)
Comments
Please login to add a commentAdd a comment