సారూ.. మా పేరు లేదు
● నాలుగు పథకాల లబ్ధిదారుల జాబితాలు గ్రామసభల్లో ప్రకటన ● నిలదీతలు, ప్రశ్నల వర్షం కురిపించిన ప్రజలు ● అర్హులకు చోటు దక్కలేదని ఆగ్రహం ● రసాభాసగా మారిన గ్రామసభలు
సాక్షి, పెద్దపల్లి: సార్.. మా పేరు లిస్టులో లేదు. మాకు గుంట భూమి లేదు. ఆస్తులు లేవు. కనీసం రేషన్ కార్డు సైతం లేదు. ప్రజాపాలన, ప్రజావాణిలో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల దరఖాస్తు చేసుకున్నాం. తీరా చూస్తే జాబితాలో మా పేరు లేదంటూ లబ్ధిదారుల నిలదీతలతో జిల్లావ్యాప్తంగా మంగళవారం మొదటి రోజు గ్రామసభలు జరిగాయి. భూ స్వాములకు, అనర్హులకు జాబితాలో పేరు ఎక్కించారు. ఏం లేని వారి పేర్లు మాత్రం ఎక్కించలేదంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కలిసి మెలిసి ఉండే ఊళ్లో గ్రామసభలు పెట్టి అనర్హుల పేర్లు జా బితాలో పెట్టి, అర్హులైన వారి పేర్లు పెట్టలేదు. ఒక్కరికి మీద ఒక్కరు ఫిర్యాదులు చేసుకోవాలా? అంటూ అధికారుల తీరుపై మహిళలు మండిపడ్డారు. జాబితాలో పేరు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు నచ్చజెప్పడంతో పలు చోట్ల లబ్ధిదారులు మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా మొదటి రోజు గ్రామసభలు నిలదీతలు, నిరసనలు, బహిష్కరణలతో గరంగరంగా కొనసాగాయి. లిస్టులో పేరు ఉన్నవారు ఆనందం వ్యక్తం చే యగా, పేరు లేని వారు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించి తమ నిరసన వ్యక్తం చేశారు. మొదటి రోజున 90జీపీలు, మున్సిపాలిటీల్లోని 43 వార్డుల్లో సభలు జరిగాయి. పలు సభల్లో కలెక్టర్ కోయ శ్రీహ ర్ష, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణు, ఎమ్మెల్యే విజయరమణరావు తదితరులు పాల్గొన్నారు.
అయోమయం.. అసంతృప్తి
ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను గ్రామసభల్లో అధికారులు చదవి వినిపించారు. జాబితాలో తమ పేరు ఉందని సంతోషపడేలోపు, ఇదే లిస్ట్ ఫైనల్ కాదు అని ఇందులో మొదటి దశలో కొంతమందిని ఎంపిక చేస్తామని అధికారులు చెప్పటంతో జాబితాలో పేర్లు ఉన్న వారిలో ఆయోమయం నెలకొంది. పేర్లు లేని వారు ఆందోళన చేస్తుండటంతో అధికారులు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని నచ్చజెప్పుతుండటంతో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి అంటూ పలుచోట్ల మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోలీస్ నీడలో..
మంగళవారం నిర్వహించిన గ్రామసభల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పహారా నిర్వహించారు. పలుచోట్ల అనర్హులను చే ర్చారంటూ నిలదీస్తున్న వారిని పోలీసులు పక్కకు తీసుకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అ భ్యంతరాలు చెప్పేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నామని చెప్పి, పోలీసులతో ఎందుకు అడ్డుకుంటున్నారని పలుచోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో కంటతడి పెడుతూ కనిపిస్తున్న మహిళ రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన వాలకట్ల భూమక్క. మంగళవారం రేగడి మద్దికుంటలో నిర్వహించిన గ్రామసభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబి తాలో పేరు ఉందని చదవటంతో ఆనందంతో భావోద్వేగంకు లోనై కంటతడిపెట్టింది.
ఈచిత్రంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ పంచాయతీ కార్యదర్శిని నిలదీస్తున్న లబ్ధిదారులు కమాన్‌పూర్ మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన వారు. ఈ గ్రామంలో మొత్తం 518మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో నలుగురు ఇటీవల చనిపోగా, మరో ఐదుగురు స్థానికంగా లేకపోవడంతో 509 కుటుంబాలను అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఇందులో 279మంది ఇంటి స్థలం ఉన్న వారు ఉండగా, 26మంది స్థలంలేని వారని, 305మంది అర్హులు అంటూ గ్రామసభలో అధికారులు జాబితాలోని పేర్లు చదవి వినిపించారు. అయితే జాబితాలో సుమారు 213మంది పేర్లు లేకపోవడంతో వారందరూ తమ పేర్లు లేవంటూ అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని నచ్చజెప్పగా, ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా మొదటి రోజు జరిగిన గ్రామసభల్లో అన్ని చోట్ల దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులు అధికారులను అనేక సందేహాలతో ప్రశ్నల వర్షం కురిపించారు.
అనర్హులకు చోటు కల్పించారంటూ..
ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కేవలం 52మంది లబ్ధిదారులనే ఎంపిక చేశారని, అందులో సగం మందికి వ్యవసాయ భూమలున్నాయని, అసలు గుంట భూమి లేని వారికి మాత్రం జాబితాలో చోటు కల్పించలేదంటూ మాజీ సర్పంచ్ గుజ్జుల వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ బహిష్కరించారు. దీంతో చేసేది ఏమిలేక అధికారులు వెనుతిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment