శృంగవరపుకోట నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మాట్లాడుతున్న మంత్రి బొత్స, చిత్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నినాదంగానే మిగిలిపోయిన సామాజిక సాధికారతను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేసి చూపించారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శనివారం విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో జరిగిన సభలో మంత్రి బొత్స మాట్లాడారు. జగన్ సీఎం అయింది మొదలు గత 53 నెలలుగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా పేదలంటూ వారి సంక్షేమానికి, సాధికారతకు అవిరళ కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇన్నాళ్లకు సాకారమైన సామాజిక సాధికారత కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో మరోసారి జగన్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాయని, ఆ పార్టీల నాయకుల మాటలు నమ్మి మరోసారి బలి కావొద్దని అన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 600 హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. పైగా రుణ మాఫీ పేరుతో రైతులను, మహిళలను చంద్రబాబు మోసం చేశారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కరోనా వంటి క్లిష్టపరిస్థితుల్లోనూ నవరత్నాలను అమలుచేశారని వివరించారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో జరిగిన సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం
త్వరలోనే రూ.3 వేల పింఛను: ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు
రాష్ట్రంలోని వృద్ధులు రూ.3 వేలు పింఛను అందుకునే రోజు త్వరలోనే వస్తోందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా పింఛన్లు అందజేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు.
సీఎం జగన్ మానవత్వం.. ఇదే నిదర్శనం
ఆలమండ రైలు ప్రమాదంపై వెంటనే స్పందించారు
ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి
ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనసున్న నేత. మానవత్వంలో మేటి. ఇటీవల ఆలమండలో జరిగిన రైలు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఆయన స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం’ అని ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చెప్పారు. ‘ఆలమండలో రైలు ప్రమాద వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. సమీప ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న అంబులెన్సులు, అత్యవసర వైద్య సేవల సిబ్బందిని ప్రమాద స్థలానికి పంపించారు.
40 అంబులెన్స్‌లతో గంట వ్యవధిలోనే క్షతగాత్రులను తరలించేలా ఏర్పాట్లు చేశారు. సకాలంలో వైద్య సేవలు అందడంతో ఎంతోమంది ప్రాణాలు నిలిచాయి. సీఎం స్పందించబట్టే ఈ తరహా సేవలు సాధ్యమయ్యాయి. లేదంటే సకాలంలో వైద్యం అందక నష్టం ఎక్కువ జరిగి ఉండేది.’ అని ఆయన వివరించారు. మరునాడు ముఖ్యమంత్రే స్వయంగా బాధితులను పరామర్శించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారని చెప్పారు.
సంక్షేమ పథకాలతో తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని ఎస్ కోట ప్రజలు ఆనందంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని గిరిజనుల అభ్యున్నతి సీఎం జగన్‌తోనే సాధ్యమైందని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి సహా అనేక పదవులు ఇచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, కంబాల జోగులు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ రఘురాజు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జీసీసీ చైర్‌పర్సన్ శోభా స్వాతీరాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment