రైతుల పట్ల యమపాశం: హరీశ్‌ | BRS Leader Harish Rao Comments On Congress | Sakshi
Sakshi News home page

రైతుల పట్ల యమపాశం: హరీశ్‌

Published Mon, Sep 9 2024 6:20 AM | Last Updated on Mon, Sep 9 2024 6:21 AM

BRS Leader Harish Rao Comments On Congress

ప్రభుత్వంపై హరీశ్‌ ధ్వజం 

కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ నిబంధనతో రైతు సురేందర్‌ రెడ్డి ఆత్మహత్య 

రుణమాఫీని ఎగ్గొట్టడానికే 31 సాకులు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ తొమ్మిది నెలల పాలన అన్నదాతల పట్ల యమపాశంగా మారిందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ నయవంచనతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని తెలిసి సురేందర్‌ రెడ్డి మేడ్చల్‌లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు లేఖ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. 

రైతు రుణమాఫీ ఆంక్షలతో రేవంత్‌ కుటుంబ బంధాల్లో కూడా చిచ్చుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సురేందర్‌కు ఏపీజీవీపీ బ్యాంకులో రూ.1.92 లక్షల అప్పు ఉందని, వాళ్ల అమ్మకు రూ.1.15 లక్షల అప్పు ఉండటంతో బ్యాంకు మేనేజర్‌ కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెప్పడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని వివరించారు. రుణమాఫీకి రేషన్‌ కార్డు లింకు లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, సురేందర్‌ ఆత్మహత్యతో సీఎం చెప్పిన మాటలు తప్పని తేలాయన్నారు. రేవంత్‌ పాలనకు సురేందర్‌ రెడ్డి లేఖ పంచనామా లాంటిదని చెప్పారు.  

కుటుంబ బంధాల విచ్ఛిన్నం 
కేసీఆర్‌ కుటుంబ బంధాలను బలోపేతం చేస్తే వాటిని రేవంత్‌ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని హరీశ్‌రావు మండిపడ్డారు. తన నియోజకవర్గంలో జక్కాపూర్‌ గ్రామంలో గురజాల బాల్‌రెడ్డి కుటుంబంలో ముగ్గురికి రుణం ఉందని, వారికి ఆరు లక్షల అప్పు ఉంటే కేవలం రెండు లక్షలే మాఫీ అవుతోందని చెప్పారు. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయన్నారు. రుణ మాఫీ ఎగ్గొట్టడానికి రేవంత్‌ ప్రభుత్వం 31 సాకులు చూపెడుతోందన్నారు. 

కుంభాల సిద్ధారెడ్డి, చాట్ల హరీష్‌ అనే రైతులకు భార్యల ఆధార్‌ కార్డులు తెమ్మంటున్నారని, వారికి పెళ్లే కానప్పుడు భార్యల ఆధార్‌ కార్డులు ఎక్కడ్నుంచి తెస్తారని ప్రశ్నించారు. 20 లక్షల మందికే ఇప్పటిదాకా రుణ మాఫీ అయిందని, ఇంకా 21 లక్షల రైతులకు మాఫీ కావాల్సి ఉందన్నారు. ఇప్పటిదాకా 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. 

కేసీఆర్‌ పదకొండు విడతలుగా రైతు బంధు ఇచ్చారని, యాసంగి పంట వేసే టైం వస్తున్నా... వానా కాలం రైతు బంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు. వడ్లకు బోనస్‌ బోగస్‌గా మారిందని ఎద్దేవా చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతుల కోసం బీఆర్‌ఎస్‌ ప్రాణాలకు తెగించి పోరాడుతోందన్నారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement