బాబు మాటలు నీటిమీద రాతలు! | Sakshi
Sakshi News home page

బాబు మాటలు నీటిమీద రాతలు!

Published Mon, Apr 29 2024 10:45 AM

 Chandrababu Naidu Fake Promises In 2024 Election

ప్రతిసారి ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీ అధినేత

2014లో ఇచ్చిన హామీలనే అమలు చేయని పరిస్థితి

అంతకుమునుపు మదనపల్లె, తాజాగా రాజంపేటను జిల్లాగా మారుస్తామంటూ ప్రగల్బాలు

బాబు వైఖరిపై విస్తుపోతున్న జనం  

టీడీపీ అధినేత చంద్రబాబు హామీలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారమే పరమావధిగా ఎక్కడికి వెళితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మాటలు మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. బాబు హామీలు చూసి జనం నివ్వెరపోతున్నారు.  

సాక్షి రాయచోటి: విశ్వసనీయత..నిజాయితీతో రాజకీయాలు చేసేవారు మొదటి రకమైతే.. ఏదో ఒక రకంగా తప్పుడు మాటలు చెబుతూ అప్పటికప్పుడు ప్రజల్లో పరపతి కోసం పాకులాడేవారు రెండోరకం. ప్రజాస్వామ్యంలో విలువలను కాలరాసి అధికారమే పరమావధిగా అడుగులు వేసే నాయకుల్లో ముందుగా చంద్రబాబును చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి నానుతున్న సమస్యను ఎత్తి చూపి....తర్వాత అధికారంలోకి రాగానే బురిడీ కొట్టించడం టీడీపీ అధినేతకు పరిపాటిగా మారింది. గతంలోనూ 2014కు ముందు, తర్వాత అధికారంలోకి వచ్చినా అనేక రకాల హామీలను తుంగలో తొక్కారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేటలో జరిగిన ప్రజాగళంలోనూ  ప్రజలను తప్పుదోవ పట్టించేలా చెప్పిన పలు మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

హామీలు గాలికి.. 
ఒకప్పుడు ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో.. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని రాజంపేట ప్రాంతాన్ని ఉద్యాన హబ్‌గా మారుస్తానని ఎన్నోసార్లు ఊదరగొట్టిన బాబు తర్వాత ఆ హామీని గాలికి వదిలేశారు. 2014కు ముందు ఎన్నికల ప్రచారంలోనూ, తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా హబ్‌గా మారుస్తామంటూ ఐదేళ్లు కాలం గడిపారే తప్ప అమలుకు శ్రీకారం చుట్టలేదు. పండ్ల తోటలు విస్తారంగా ఉన్న రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పినా ఎక్కడా కూడా ఒక చిన్నపాటి పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఇలా అప్పుడు, ఇప్పుడు మారని మనిíÙగా చెబుతూనే ఉన్నారు.  

సుబ్బారావు మృతిపై ‘పచ్చ’ రాజకీయం 
ఒంటిమిట్ట మండలం మాధవరానికి చెందిన చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం ఇటీవల భూ వివాదం వ్యవహారమై ఆత్మహత్య చేసుకుంది. అయితే దీన్ని కూడా చంద్రబాబు రాజంపేట కేంద్రంగా పచ్చరాజకీయం చేయడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015–17 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే రెవెన్యూ రికార్డుల్లో భూమికి సంబంధించిన మార్పులు, చేర్పులు జరిగాయి. అందులో భాగంగా కట్టా కుటుంబీకుల పేరు ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది. అప్పట్లోనూ టీడీపీతో అంటకాగిన ‘కట్టా’ కుటుంబం ఇప్పుడు కూడా టీడీపీలోనే ఉంది. అయితే బాబు మాత్రం సుబ్బారావు కుమార్తె లక్ష్మీప్రసన్నను రాజంపేట సభా వేదికపై జనానికి పరిచయం చేసి వైఎస్సార్‌సీపీ అన్యాయం చేసినట్లు చెప్పడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మరొకసారి జిల్లా పేరుతో కపటనాటకం 
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక్కోసారి ఒక్కో మాట చెప్పడం సర్వసాధారణంగా మారింది. గతంలో టీడీపీ కార్యక్రమంలో భాగంగా మదనపల్లెకు వచ్చినప్పుడు జిల్లా కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. మళ్లీ ఎన్నికలకు ముందు రాజంపేట ప్రజాగళం సభలో మరొకమారు రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని నమ్మబలికారు.  తాను ఎక్కడికి వెళితే అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లా కేంద్రం చేస్తామని ప్రకటించడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఇదేమి రాజకీయాలంటూ ప్రజలు చర్చించుకోవడం కనిపిస్తోంది. ఏదిఏమైనా ఓట్లు, సీట్ల కోసం బాబు ఎన్ని కపట నాటకాలకైనా తెరతీస్తారని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు. 

Advertisement
Advertisement