సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు త్వరలో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెలాఖరులో జరిగే సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూలు ఒకటి రెండురోజుల్లో ఖరారు కానుంది. హైదరాబాద్ లేదా మరోచోట త్వరలో బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని ఈనెల 20న ముంబై పర్యటన సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు. అయితే వచ్చే నెల రెండో వారంలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోగానే బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా ఆ భేటీలో చర్చించాల్సిన అంశాలపై వివిధ వర్గాలతో సమావేశమయ్యేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు నిమగ్నమై ఉన్నా ఢిల్లీ పర్యటన సందర్భంగా కొన్ని ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యే అవకాశముంది. వివిధ రంగాల నిపుణులతో పాటు పాలన వ్యవహారాల్లో విశేష అనుభవమున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, విదేశాంగ వ్యవహారాల్లో అనుభవమున్న వారితోనూ భేటీ అవుతారు. దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయ ప్రత్యామ్నాయానికి ఎలాంటి ఎజెండా అవసరమనే కోణంలో చర్చలు సాగనున్నాయి. అయితే సీఎం ఢిల్లీలో ఎన్నిరోజుల పాటు బస చేస్తారు, ఎవరెవరితో భేటీ అవుతారు వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ ఒకరు చెప్పారు.
మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు?
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25 లేదా 28వ తేదీ నుంచి ప్రారంభించాలని తొలుత భావించినా, ఢిల్లీ పర్యటన తర్వాతే నిర్వహించాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి 3వ తేదీన ప్రారంభించే అవకాశముంది. కాగా మహిళా, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్‌ను పరామర్శించేందుకు సీఎం శుక్రవారం మహబూబాబాద్‌కు వెళ్లనున్నారు. సత్యవతి రాథోడ్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.
నెలాఖరులో కేసీఆర్ హస్తిన టూర్
Published Fri, Feb 25 2022 3:45 AM | Last Updated on Fri, Feb 25 2022 8:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment