స్టేలు తెచ్చుకోవడంలో బాబుది గిన్నిస్‌ రికార్డ్‌ | Kodali Nani Comments On Chandrababu Naidu And Lokesh | Sakshi
Sakshi News home page

స్టేలు తెచ్చుకోవడంలో బాబుది గిన్నిస్‌ రికార్డ్‌

Published Sun, Mar 21 2021 5:41 AM | Last Updated on Sun, Mar 21 2021 5:41 AM

Kodali Nani Comments On Chandrababu Naidu And Lokesh - Sakshi

సాక్షి, అమరావతి/గుడివాడ టౌన్‌: కేసులను ఎదుర్కోలేక దేశంలోనే అతి ఎక్కువ స్టేలు తెచ్చుకున్న నాయకుడిగా చంద్రబాబు గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరావు (నాని) విమర్శించారు. చేసిన దొంగ పనులకు సమాధానం చెప్పలేని చవట, దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాటే అని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో సీఐడీ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు 31వ స్టే తెచ్చుకున్నాడన్నారు. ఉచ్చం, నీచం లేని చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకోవడంలో దిట్ట, బ్రోకర్, వెధవ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. పోలీసు విచారణను ఎదుర్కోలేని పిరికిపంద, తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం కూడా చెప్పుకోలేని చవట దద్దమ్మ చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. జయంతి, వర్థంతికి తేడా తెలియని పనికిమాలిన వ్యక్తి పప్పు లోకేశ్‌ అని చెప్పారు. చంద్రబాబు పెద్ద బ్రోకరని ఆనాడే ఎన్టీఆరే చెప్పారని గుర్తు చేశారు. కాళ్లు పట్టుకోవడం, చీకటి ఒప్పందాలు చేసుకోవటమే చంద్రబాబు చరిత్ర అని ఎద్దేవా చేశారు. 

పప్పు, తుప్పులకు ప్రజా క్షేత్రంలోనే శిక్ష
దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్న చరిత్ర లోకేశ్‌దని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో లోకేశ్‌ ఫీజుల్ని సత్యం రామలింగరాజే కట్టారని, దమ్ముంటే స్టాన్‌ఫర్డ్‌ ఫీజుల గుట్టును లోకేశ్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాల కోసం పిచ్చిపిచ్చి ట్వీట్లు చేస్తే ప్రజా క్షేత్రంలో శిక్ష పడుతుందన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్న పప్పు, తుప్పులకు ప్రజాతీర్పే పెద్ద శిక్ష అన్నారు. సీఎం జగన్‌ దెబ్బకు పప్పు, తుప్పులిద్దరూ ఇంట్లోనే జైలు జీవితం అనుభవిస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే కేంద్రాన్ని, మోడీని చంద్రబాబు, లోకేశ్‌ ప్రశ్నించాలని, ఢిల్లీలో నిరసనలు తెలపాలన్నారు. తిరుపతి పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని 4 లక్షలకు పైగా మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని జోస్యం చెప్పారు.

స్టే తెచ్చుకున్నంత మాత్రాన నిర్దోషి కాదు
గుడివాడలో విలేకరులతో కొడాలి నాని మాట్లాడుతూ.. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నంత మాత్రాన చంద్రబాబు నిర్దోషి కాదని, ప్రజాక్షేత్రంలో దోషిగా నిలవక తప్పదన్నారు. దర్యాప్తునకు హాజరైతే అవినీతి బాగోతం బయట పడుతుందనే భయంతోనే చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని మంత్రి కొడాలి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement