( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం విమర్శించారు. తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్‌ఎస్, బీజేపీతో కలుస్తుందని చెప్పారు. యాంటీ బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఎం పోటీలో లేని చోట ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్‌కే తమ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఇస్తుందని తెలిపారు.
దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమని ఏచూరి తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో కొంత బలం ఉన్నా.. ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బంది అయ్యాయని విమర్శించారు. బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందని మండిపడ్డారు. బీజేపీకి అతిపెద్ద మిత్రపక్షాలు ఈడీ, సీబీఐ అని.. ఆ మిత్రులతో కలిసి బీజేపీ దేశంలో ఏదైనా చేయగలదని ధ్వజమెత్తారు.
‘ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై అకౌంటబిలిటీ కనిపించడం లేదు. టన్నెల్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు?. ఆ ఘటనకు భాధ్యత ఎవరు వహించాలి?. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు మోదీ పాల్పడుతున్నారు అయినా ఈసీఐ నోటీసులు ఇవ్వదు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా కాంగ్రెస్ నష్టం లేదు అనే భావనలో కాంగ్రెస్ ఉంది.
నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. ఒకటి, రెండు సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీది. పొలిటికల్ బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలు లీగల్‌గా అవినీతికి పాల్పడుతున్నాయి, పొలిటికల్ పార్టీల ఖర్చుపై పరిమితం పెట్టాలి. ఇండియా కూటమి ఏర్పడిన ఉద్దేశంతోనే ముందుకు వెళ్తోంది. మణిపూర్ ఘటన వెనుక రాజకీయ కుట్రకోణం ఉంది. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని కోరుతున్నాం’ అని ఏచూరి పేర్కొన్నారు.
చదవండి: మోదీ-కేసీఆర్ ఫెవికాల్ బంధం బయటపడిందిలా..: రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment