కమలాపూర్/హుజూరాబాద్ : కేసీఆర్ ఒక్కడితో తెలంగాణ రాష్ట్రం రాలేదని, వందలాది మంది యువకుల బలిదానాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ఏడేళ్లుగా కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని కేంద్ర విదేశీ, పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌గౌడ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూం ఇల్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి గౌడ గర్జన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలో బీజేపీ గెలుపు తెలంగాణ చరిత్రకు మలుపు కావాలని ఆయన ఆకాంక్షించారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపించారు.
ఏడేళ్లుగా గుర్తుకురాని దళితులు ఇప్పుడే ఎందుకు గుర్తుకొస్తున్నారని ప్రశ్నించారు. గౌడకులంలోనూ పేదలు ఉన్నారని వారందరికీ గౌడబంధు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారని విమర్శించారు. కేంద్రం నుంచి ప్రధాని మోదీ 1.70 లక్షల ఇళ్లు రాష్ట్రానికి మంజూరు చేస్తే ఒక్కటి కూడా కట్టించి ఇవ్వలేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీమంత్రి ఈటలను కేసీఆర్ అవమానించి బయటకు పంపితే ఆత్మగౌరవం కోసం బీజేపీలో చేరారని పేర్కొన్నారు. ఆయన ప్రగతిభవన్లో కూర్చుని ఆదేశిస్తే వాటిని ఆచరించే మూర్ఖుడు హరీశ్‌రావు అని. ఇలాంటి పిచ్చివేషాలు బంద్ చేయకపోతే భరతం పట్టడం ఖాయమని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలంగౌడ్, నందీశ్వర్‌గౌడ్, ధర్మారావు, బీజేపీ హన్మకొండ, కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు రావు పద్మ, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో కుటుంబ పాలన
Published Mon, Sep 6 2021 5:13 AM | Last Updated on Mon, Sep 6 2021 5:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment