ఒంగోలు అర్బన్: నిర్దేశించిన మేరకు జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనం నుంచి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సోమవారం వీడియో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉపాధిహామీ పనులతో పాటు గ్రీవెన్స్ అర్జీల పరిష్కారం, కోర్టు కేసులు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల పనులు, హౌసింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన సీసీరోడ్లు, సైడు కాలువలు, ఇంకుడు గంతల నిర్మాణాలు, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్, ఫారంపాండ్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించి ఎటువంటి జాప్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. టైంబౌండ్ కేసులు, డైరెక్షన్, ధిక్కార, రిట్ పిటిషన్లపై శాఖల వారీగా ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ ఓబులేసు, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ లోకేశ్వరరావు, డ్వామా పీడీ జోసఫ్, సీపీఓ వెంకటేశ్వర్లు, డీపీఓ వెంకటనాయుడు, డీఎంహెచ్‌ఓ సురేష్, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ భరద్వాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment