పచ్చని దోపిడీ..! | - | Sakshi
Sakshi News home page

పచ్చని దోపిడీ..!

Published Wed, Nov 13 2024 1:22 AM | Last Updated on Wed, Nov 13 2024 1:50 AM

పచ్చని దోపిడీ..!

పచ్చని దోపిడీ..!

పేదల బియ్యం

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు అందాల్సిన బియ్యాన్ని అధికార పార్టీ నేతలు పందికొక్కుల్లా బొక్కేస్తున్నారు. జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రేషన్‌ బియ్యం పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. పథకం ప్రకారం రేషన్‌ దుకాణాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత బియ్యాన్ని అడ్డూ అదుపూలేకుండా నల్లబజారుకు తరలించేస్తున్నారు. జిల్లాలో ప్రతి రోజూ రాత్రయితే చాలు చీకటి మాటున టన్నులు కొద్దీ బియ్యాన్ని జిల్లాలు దాటిస్తున్నారు. పల్నాడు, నంద్యాల జిల్లాలకు పంపి పాలిష్‌ చేసి అక్కడ నుంచి నెల్లూరు జిల్లాలోని ఒక పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో 1392 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ఇందులో వెయ్యి మందికి పైగా రేషన్‌డీలర్లను బలవంతంగా తప్పించి అధికార పార్టీ నేతల అనుచరులకు కట్టబెట్టారు. దీంతో వారు చెప్పిందే వేదంగా మారింది. ఒక్కో రేషన్‌ డీలర్‌ పరిధిలో కనీసం 500 కార్డులు ఉంటాయి. డీలర్లు బియ్యం విక్రయించడం సంగతి అటుంచి వారే వినియోగదారుల నుంచి బహిరంగంగా బియ్యాన్ని కొంటున్నారు. ఇందుకు సంబంధించి అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ప్రతీ గ్రామంలో 10 నుంచి 15 మందితో కూడిన దళారుల బృందం ఒకటి తయారైంది. కిలో బియ్యం పది నుంచి పదిహేను రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ బియ్యాన్ని 20 నుంచి 25 రూపాయల వరకు దళారికి అమ్ముకుంటారు. దళారుల చేతుల్లోంచి బడా వ్యాపారులు మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేసి నంద్యాల, పల్నాడు జిల్లాలకు తరలించి రీ సైక్లింగ్‌ చేసి గోతాలు మార్చి కృష్ణపట్నం పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ తతంగమంతా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో జరుగుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రజా ప్రతినిధులకు వాటాలు..

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కాసుల వర్షం కురిస్తోంది. అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు పోలీసులు, విజిలెన్స్‌ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత ఆ నియోజకవర్గ ప్రజా ప్రతినిధిదే. సదరు ఎమ్మెల్యేకి ప్రతి నెలా పెద్ద మొత్తంలో ముట్టచెబుతుంటారని తెలుస్తోంది. కేవలం ఎమ్మెల్యేకే కాకుండా మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులకు వారి స్థాయిని బట్టి వాటాలు పోతుంటాయని సమాచారం. రేషన్‌ అక్రమ వ్యాపారం రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు కామధేనువులా, ఏటీఎంలా తయారైందని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.

అక్రమ రేషన్‌ ఖిల్లా పశ్చిమ ప్రకాశం

అక్రమ రేషన్‌ వ్యాపారానికి పశ్చిమ ప్రకాశం అడ్డాగా మారిందని ప్రచారం జరుగుతోంది. నిన్నా మొన్నటి వరకు రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారాన్ని నిర్వహించిన ఒక వ్యాపారి కోట్లకు పడగలెత్తినట్లు సమాచారం. ఇప్పుడు తెలుగు దేశం ఇన్‌చార్జి ఎరిక్షన్‌ బాబు ముఖ్య అనుచరులు ఈ అక్రమ వ్యాపారాన్ని చేజిక్కించుకొని ఆయనను పక్కకు తప్పించినట్లు వినికిడి. ఇటీవల త్రిపురాంతకం మండలంలో రేషన్‌ రవాణా విషయంలో తెలుగుదేశం పార్టీలోని రెండు గ్రూపుల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇక్కడే కాకుండా జిల్లాలో అనేక చోట్ల టీడీపీ నాయకుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఆ మధ్య పెద్దారవీడు మండలంలోని దేవరాజు గట్టు వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుపడిన రేషన్‌ బియ్యం పట్టుబడింది. తనిఖీలు నిర్వహించిన పోలీసులను అమానిగుడిపాడుకు చెందిన టీడీపీ నాయకుడు దుర్భాషలాడినట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత రంగప్రవేశం చేసిన ఎరిక్షన్‌ బాబు పోలీసుల ఆధీనంలో ఉన్న రేషన్‌ లారీని విడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. యర్రగొండపాలెం మండలంలోని అమానిగుడిపాడు గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ షహదత్‌ వెంకట త్రివినాగ్‌ సినీఫక్కీలో లారీని వెంటాడి పట్టుకోవడం సంచలనం సృష్టించింది. రెవెన్యూ అధికారులు, పోలీసులతో కలిసి ఛేజ్‌ చేసిన సబ్‌ కలెక్టర్‌ కంభం మండలంలోని కందులాపురం వద్ద అర్ధరాత్రి లారీని అడ్డుకొని అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆ లారీలో 3 టన్నుల బియ్యం ఉన్నట్లు సమాచారం. ఈ బియ్యం కూడా ఎరిక్షన్‌ బాబు అనుచరులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతిపక్ష డీలర్లకు వేధింపులు:

భారీ మొత్తంలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రెవెన్యూ అధికారులు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చెప్పిన రేషన్‌ డీలర్లను వేధించే పనిలో తలమునకలుగా ఉన్నారు. ఒంగోలులోని ఒక రేషన్‌ డీలర్‌ను రాజీనామా చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అందుకు అతడు నిరాకరించాడు. దాంతో అతడిపై ఎలాగైనా సరే కేసులు పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉదయం లేచిందగ్గర్నుంచి ఆ డీలర్‌ దగ్గరకే వెళ్లి రకరకాల ప్రశ్నలతో వేధిస్తున్నట్లు సమాచారం. ఒకసారి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌తో ఫోన్‌ చేయించమని సదరు రెవెన్యూ అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్న రెవెన్యూ అధికారులు రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారుల వైపు కన్నెత్తి చూడడం లేదు.

పట్టుబడిన అక్రమ బియ్యం:

సంతనూతలపాడులోని నాగరాజు ట్రేడర్స్‌ రైస్‌ మిల్లుపై ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మశ్రీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఈ రైస్‌ మిల్లులో పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో సుమారు రూ.40 లక్షల విలువైన 80 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు 7వ తేదీ తెల్లవారుజామున తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు గ్రామంలో రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. బొద్దికూరపాడు గ్రామంలోని ఒక పెట్రోలు బంకులో నిల్వ చేసిన బియ్యాన్ని ఒక లారీలోకి లోడ్‌ చేసి రాజంపల్లికి వైపు వెళుతుండగా విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి రూ.6.80 లక్షల విలువైన 368 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. యర్రగొండపాలెం మండలంలోని సాయిబాబా నగర్‌ వద్ద రీ సైక్లింగ్‌ చేస్తున్న 600 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. చీమకుర్తి మండలంలోని మంచికలపాడు గ్రామంలో రెండు నెలలుగా రేషన్‌ బియ్యం పంపిణీ చేయడం లేదని సమాచారం. ప్రజలు పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా తూ తూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి నామమాత్రంగా 6ఏ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

జిల్లాలో అడ్డూ ఆపు లేని బియ్యం మాఫియా నంద్యాల, పల్నాడు జిల్లాల్లో రీసైక్లింగ్‌ దొడ్డిదారిన నెల్లూరు జిల్లాలోని పోర్టుకు తెలుగు తమ్ముళ్ల బొజ్జలు నింపుతున్న పీడీఎస్‌ బియ్యం పశ్చిమ ప్రకాశం కేంద్రంగా జోరుగా దందా నామమాత్రపు దాడులతో సరి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement