హడావుడి తప్ప కేటాయింపులేవీ..
పెద్దదోర్నాల: వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట్ర మంత్రులు అప్పటికప్పుడు హడావుడి చేశారే తప్ప, నిధులు కేటాయించటంలో చిత్తశుద్ధి చూపించలేకపోయారని సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యుడు బీవీ.రాఘవులు విమర్శించారు. కొత్తూరు వద్ద జరుగుతున్న సొరంగ నిర్మాణ పనులను సీపీఎం బృందంతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొద్ది రోజుల కిందట ముగ్గురు రాష్ట్ర మంత్రులు వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన విషయాన్ని ఆయన ఈ గుర్తు చేశారు. రెండు సొరంగ నిర్మాణాల ఎదుట నిలబడితే ఎవరికీ పట్టని అనాథల్లా అవి కనబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి దశ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.4 వేల కోట్లు అవసరమైతే, బడ్జెట్‌లో కేవలం రూ.394 కోట్లు కేటాయించారని విమర్శించారు. మంత్రులు వచ్చి ఇక్కడ హడావుడి చేయటం ఎందుకు..అక్కడికి వెళ్లి ముష్టి వేసినట్లు బడ్జెట్ కేటాయించటం ఎందుకని ప్రశ్నించారు. ఇది కేవలం ప్రజలను మోసగించేందుకేనని అన్నారు. నల్లమల సాగర్ రిజర్వాయర్, హెడ్ రెగ్యులేటర్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయని, కేవలం కొద్దిగా లైనింగ్ పనులు పూర్తిచేసి మొదటి సొరంగం ద్వారా ఈ ప్రాంతానికి నీరందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాను గతంలో 2006లో ఈ ప్రాంతంలో పర్యటించానని తెలిపారు. ఇంతటి చిన్న ప్రాజెక్టు పూర్తి చేసేందుకు దాదాపు 30 సంవత్సరాలు పడుతుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.వేల కోట్లు కేటాయిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొద్ది పాటి బడ్జెట్‌ను కేటాయిస్తే వెలుగొండ వంటి ఓ మంచి ప్రాజెక్టును పూర్తి చేయ్యెచ్చనే ఆలోచనను ఈ ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జూన్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ సెక్రటరీ సయ్యద్ హనీఫ్, జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెలుగొండ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం రూ.4 వేల కోట్లు అవసరమైతే కేటాయించింది రూ.394 కోట్లే సొరంగ నిర్మాణాలు అనాథల్లా కనబడుతున్నాయని ఎద్దేవా సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యుడు బీ.వి రాఘవులు
Comments
Please login to add a commentAdd a comment