ఇది ముంచే ప్రభుత్వం
● మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్
మర్రిపూడి: కూటమి ప్రభుత్వం అంకెల గారడీతో డాబుసరి బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మర్రిపూడి మండలం కూచిపూడికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి ఉపయోగడే ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారో చెప్పాలని మంత్రి స్వామిని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమం కోసం ఎంత నిధులు కావాలి, ఎంత కేటాయించారో చెప్పాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థుల కోసం వసతి దీవెన, విద్యా దీవెన కోసం త్రైమాసికంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించారని గుర్తు చేశారు. ఐదు నెలల నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ప్రజలను నైరాశ్యంలోకి నెట్టి ఇప్పుడు అంకెల గారడీ బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలను ఏమారుస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేదోడు వంటి సంక్షేమ పథకాలు అందించి ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అభి వృద్ధి మరిచి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. అక్రమ కేసులపై హైకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వ తీరు మారలేదన్నారు. కూటమి ప్రభుత్వం చేసే అక్రమ అరెస్టులు, అరాచకాలపై అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, బోద రమణారెడ్డి, మాకినేని వెంకట్రావు పాల్గొన్నారు.
బాలికపై లైంగికదాడి చేసిన ఉపాధ్యాయుడు అరెస్టు
టంగుటూరు: మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఆ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు వీరపనేని చెన్నకేశవులును మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలులోని నెల్లూరు బస్టాండులో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సింగరాయకొండ సీఐ హజరత్తయ్య తెలిపారు.
జాతీయ సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు వెంకట్రావు
టంగుటూరు: జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు ఆలకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాకా వెంకటేశ్వర్లు ఎంపికయ్యారని పీడీ వెంకట్రావు మంగళవారం తెలిపారు. నవంబర్ 9 న కృష్ణాజిల్లా విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 2025 సంవత్సరం ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో పూణేలో జరిగే ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు నుంచి పాల్గొంటారన్నారు. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రధానోపాధ్యాయులని పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment