కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై మహాధర్నా
ఒంగోలు టౌన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 26వ తేదీ కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ జిల్లా అధ్యక్షుడు చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మంచిపుస్తకం వద్ద మహాధర్నా కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయదారులు, కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అలంబిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ దినోత్సవం రోజైన ఈ నెల 26వ తేదీ దేశ వ్యాప్తంగా 500 జిల్లా కేంద్రాల్లో మహాధర్నా చేపట్టినట్లు వివరించారు. ఈ ధర్నాకు కూడా కేంద్రం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావల సుధాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రజల ప్రాథమిక హక్కులు, లౌకికతత్వం, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు భీమవరపు సుబ్బారావు, పి.పేరయ్య, డా.శ్రీనివాసులు యాదవ్, పేరం సత్యం, పిన్నికి శ్రీనివాస్, లింగా వెంకటేశ్వర్లు, మస్తాన్‌రావు, దాసరి సుందరం, కరవది సుబ్బారావు, ఎం జార్జీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment