సాంప్రదాయ క్రీడల్లో రాణించాలి
● ఏకేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు
ఒంగోలు సిటీ: విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు చదువుతో పాటు సాంప్రదాయక క్రీడల్లో బాగా రాణించాలని ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు అన్నారు. ఏకేయూ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన మహిళల ఐసీటీ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ బి.హరిబాబు పాల్గొని మాట్లాడుతూ క్రీడల్లో మహిళలు ఆసక్తి కనబరచాలన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్య విషయంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆటల పోటీల్లో గెలుపోటములు సహజమేనని, ప్రతి ఒక్క క్రీడాకారిణి క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. అంతకుముందు అంతర కళాశాలల మహిళల కబడ్డీ టోర్నమెంట్ పోటీలను రిజిస్ట్రార్ హరిబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డీడీ డాక్టర్ దేవి వరప్రసాద్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహనరావు, డీన్ ప్రొఫెసర్ సోమశేఖర, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
వచ్చే నెల 8న టీటీడీ భగవద్గీత పోటీలు
ఒంగోలు మెట్రో: తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డిసెంబర్ 8వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక మంగమూరు రోడ్డులోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం, రఘుపథంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రోగ్రాం అసిస్టెంట్ రామకృష్ణ తెలిపారు. భగవద్గీత 6 వ అధ్యాయం ఆత్మ సంయోగంలో 6, 7 తరగతులు ఒక గ్రూప్ గా, 8,9 తరగతులు రెండో గ్రూప్ గా పోటీలు నిర్వహిస్తారు. సంపూర్ణ భగవద్గీతలో 18 సంవత్సరాల లోపు వారు ఒక గ్రూప్ గా, 18 పై బడినవారు రెండో గ్రూప్ గా పోటీలు నిర్వహిస్తారు. మొత్తం నాలుగు గ్రూపులలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తారు. పోటీల్లో పాల్గొనదలచినవారు ఈ నెలాఖరు లోపు తమ వివరాలు వాట్సాప్ నెం: 9849203399 కు పంపవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన సెల్: 7386662048 ను సంప్రదించాలన్నారు.
366 శివలింగాలతో మహా లింగార్చన
● వైభవంగా నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన
ఒంగోలు మెట్రో: స్థానిక వీరన్ ఎన్‌కే గ్రీన్ సిటీ కందులూరులో నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన మహా లింగార్చన భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన 366 శివలింగాలతో 11 ఆవరణలతో ఏర్పాటు చేసి మహాలింగ అర్చన సామూహికంగా భారతుల శ్రీనివాస శర్మ నిర్వహించారు. అనంతరం కార్తీక వన సమారాధనలో నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి
●ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి
ఒంగోలు సిటీ: ఒంగోలు విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌్ కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఒంగోలులోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనంలో జిల్లా పట్టణ, తాలుకా సంఘ నాయకులు సమావేశమయ్యారు. సమావేశంలో 2025 డైరీకి సంబంధించి యాడ్స్, సభ్యత్వ నమోదు వేగవంతంపై చర్చించారు. ఒంగోలులో ఖాళీగా ఉన్న ఆఫీస్ బేరర్ పోస్టులను వెంటనే ఈసీ మీటింగ్ జరుపుకొని భర్తీ చేసుకోవాలన్నారు. డీఈఓ కార్యాలయంలో జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న కె.వి.సురేష్‌కు నిబంధనల ప్రకారం సీనియర్ సహాయకునిగా పదోన్నతి కల్పించాలని డీఈఓను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వరకుమార్, కోశాధికారి విజయభాను, పట్టణ ఉపాధ్యక్షుడు రామ్మోహనరావు యాదవ్, పట్టణ అధ్యక్షుడు రంగారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment