ఆరు నెలలకే కూటమి అట్టర్‌ఫ్లాప్
కనిగిరి రూరల్(పామూరు): రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పాలన అన్ని రంగాల్లో ఆరు నెలలకే అట్టర్‌ఫ్లాప్ అయిందని ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం గురువారం పట్టణంలోని పవిత్ర ఫంక్షన్ హాలులో పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ నేతలు హామీల అమలును తుంగలో తొక్కి ఇదేమని ప్రశ్నిస్తున్న ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ వేధింపులు ఎన్నాళ్లోసాగవని, పోలీసులు, ప్రజలు మీపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పథకాలు అమలుచేయలేక ప్రభుత్వం చేతులెత్తేసి అక్రమ కేసులతో డైవర్ట్ రాజకీయాలకు తెరతీస్తోందన్నారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తల ఊపుచూస్తుంటే విజయయాత్రకు వచ్చినట్లుందన్నారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ధర్మపాలన ఎలాఉంటుందో నాడు జగన్‌మోహన్‌రెడ్డి చూపించారని, దుర్మార్గపు పాలన ఎలాఉంటుందో నేడు టీడీపీ నాయకులు చూపిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ఓటమి ప్రజా తీర్పుతో వచ్చింది కాదని దీనికి నిదర్శనం ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు అన్నారు. మహారాష్ట్రలోని ఓగ్రామం మొత్తం దాదాపు కాంగ్రెస్‌కు ఓటువేయగా అక్కడ కాంగ్రెస్‌పార్టీకి సున్నా ఓట్లు వచ్చినట్లు ఈవీయంలలో ఉండటం, నేటికీ వారు ఆందోళన చేస్తుండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. టీడీపీవారి చర్యలకు ప్రతిచర్య ఉంటుందని చెప్పారు. సోషల్‌మీడియా యాక్టివిస్టుల పేరుతో అక్రమ అరెస్ట్‌లు పిరికి చర్య అన్నారు. బయటి నుంచి ఎంపీ అభ్యర్థిగా వచ్చిన తనకు కనిగిరి నియోజకవర్గంలో 11 వేల పైచిలుకు మెజారిటీ ఇచ్చారని, ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. కార్యకర్తకు చిన్న కష్టంవచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షునిగా తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, ఇన్‌చార్జ్ కూడా కార్యకర్తలు ప్రజల్లో మమేకమై పనిచేయాలని సూచించారు. జగన్‌మోహన్‌రెడ్డి నియమించిన వ్యక్తి ఎమ్మెల్యే అయితేనే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని ఆమేరకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలన్నారు. టీడీపీ నాయకులు దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేశామని ఇంటింటికీ వెళ్లి చెప్పాలన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం అని సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టడం తథ్యమని అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం అని, వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ మాట్లాడుతూ సామాన్యుడినైన తనకు సామాజిక వర్గ సమీకరణలో భాగంగానే కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాడు బరిలో నిలిపారన్నారు. కొద్ది రోజుల్లోనే తనకు 93 వేల ఓట్లు వచ్చాయని, దీనికి కృషిచేసి ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని చెప్పారు. అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతోనే టీడీపీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు గత ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించి, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని గత ఓటమిని వదలి ఇన్‌చార్జ్‌గా డాక్టర్ దద్దాల అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలతో కలిసి భవిష్యత్‌పై చర్చించి వారితో మమేకమై పార్టీ పరిష్టతకు, కార్యకర్తల కోసం పనిచేయాలని సూచించారు. కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో కనిగిరి ఎమ్మెల్యేగా గెలుపు తథ్యమని భరోసానిచ్చారు. ప్రతి కార్యకర్త ఓసైనికునిగా టీడీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాలని కోరారు.
రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల పేరుతో గద్దెనెక్కి నేడు పథకాల అమలును విస్మరించి ప్రజలను మోసం చేసిందన్నారు. రెడ్‌బుక్ పేరుతో వేధింపులు సిగ్గుచేటని వేధింపులు ఆపి పథకాల అమలు, పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు.
కార్యక్రమంలో పీడీసీసీబీ మాజీ చైర్మన్ వై.యం.ప్రసాదరెడ్డి, కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్.అబ్దుల్ గఫార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పెరుగు మురళీకృష్ణ, నియోజకవర్గంలోని ఆరుమండలాల ఎంపీపీ, జెడ్పీటీసీ, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీ, సర్పంచ్, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ : కారుమూరి ఈవీఎంపై అందరిలో అనుమానాలు: చెవిరెడ్డి అన్ని వేళలా అండగా ఉంటాం: బూచేపల్లి
Comments
Please login to add a commentAdd a comment