రైతులపై చంద్రబాబు చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

రైతులపై చంద్రబాబు చిన్నచూపు

Published Fri, Dec 13 2024 1:08 AM | Last Updated on Fri, Dec 13 2024 1:19 AM

రైతులపై చంద్రబాబు చిన్నచూపు

రైతులపై చంద్రబాబు చిన్నచూపు

ఒంగోలు సిటీ: కల్లబొల్లి మాటలు చెప్పి ఎన్నికల ముందు అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరు రవిబాబు ‘అన్నదాతకు అండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వర్షాలు కురవడంతో రైతులు చాలా నష్టపోయారని తెలిపారు. అయినా ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి సహాయం అందించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ అంటూ రైతులకు రూ.20 వేలు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్స్‌ చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ హయాంలో వర్షాలు కురిసినప్పడు కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే రైతులకు పంట నష్ట పరిహారం అందించినట్లు గుర్తు చేశారు. జగనన్న హయాంలో ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించడం, సొసైటీల ద్వారా సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో రైతులకు అండగా ర్యాలీ చేస్తున్నామని ప్రకటించగానే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నారని, అది కూడా సొంత వ్యక్తులను దళారులుగా పెట్టుకొని రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మద్దతు ధర రూ.1780 లు ఇవ్వాల్సి ఉండగా తేమశాతం ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ రూ.1350 నుంచి రూ.1400 లు మాత్రమే రైతుల చేతిలో పెట్టి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల రైతులు ఎకరాకు రూ.15 వేలు నష్టపోతున్నారన్నారు.

రైతులకు మద్దతుగా శుక్రవారం అంబేడ్కర్‌ భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం తలపెట్టామన్నారు. ఈ ర్యాలీలో రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. త్వరలో జెడ్పీ చైర్మన్‌ కి ఎసరు అంటూ జిల్లాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జెడ్పీ చైర్మన్‌ను పదవి నుంచి దింపడం ఎవరి వల్ల కాదన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరన్నారు. ప్రజా సమస్యలను చూపించాల్సిన మీడియా అవాస్తవాలు, అభూత కల్పనలతో పిచ్చిరాతలు రాయొద్దని హెచ్చరించారు. పార్టీ క్యాడర్‌ అంతా మాతోనే ఉందన్నారు. నేడు జరగబోయే వైఎస్సార్‌సీపీ రైతు పోరుబాట విజయవంతం చేయాలన్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ఆరు నెలలుగా వర్షాలు కురవడంతో వరి తడిసి నాని మొక్కలు వచ్చాయని, మొక్కజొన్న, పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులు నిండా మునిగి నష్టంలో కూరుకుపోతే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగనన్న హయాంలో ఏడాదికి రూ.13,500 లు ఇచ్చి వారిలో భరోసా నింపారని, ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు ఒక్క నయాపైసా కూడా ఇవ్వలేదన్నారు. మూడు రోజుల నుంచి పచ్చ పత్రికలో జెడ్పీటీసీలు వెళ్లిపోతున్నారని తప్పుడు కథనాలను వండివారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన మూడు సంవత్సరాల తర్వాత ఏదో యాత్రకు తీసుకెళతానని ముందే చెప్పానని ఇచ్చిన మాట ప్రకారం జెడ్పీటీసీ లను, వారి కుటుంబ సభ్యులను యాత్రలకు తీసుకొని వెళితే అసత్య కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. 55 మంది జెడ్పీటీసీలు ఇప్పటికీ తన వెంటే ఉన్నారని, ఓ పత్రికలో మాత్రం ఒక రోజు 29 మంది వెళ్లిపోయారని, మరోరోజు 9 మంది మాత్రమే పార్టీ మారారని తప్పుడు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీలో నుంచి వెళ్లిపోయిన వారెవరో తనకు చూపించాలన్నారు. తాను జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎంపికై న తర్వాత ఎంతో మందికి కారుణ్య నియామకాలు ఇప్పించానని, వారి వద్ద నుంచి ఒక్క నయాపైసా కూడా తీసుకోలేదన్నారు. జెడ్పీటీసీ లను బలవంతంగా తాడేపల్లికి తీసుకెళ్లినట్లు దుప్ప్రచారం చేస్తున్నారని, అలాంటి అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరు రవిబాబు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్‌, బొట్ల సుబ్బారావు, బడుగు ఇందిర, భూమిరెడ్డి రవణమ్మ మేరికుమారి, ప్రసన్న, మీరావలి, తదితరులు పాల్గొన్నారు.

నేడు కలెక్టరేట్‌ వద్ద నిరసన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement