జనాన్ని ఏమార్చుతూ.. సంక్షేమాన్ని మరిచిన కూటమి సర్కారు
ఒంగోలు అర్బన్:
‘జనాన్ని మాటలతో మాయ చేయడం, నమ్మి ఓటేసిన తర్వాత నట్టేట ముంచడం సీఎం చంద్రబాబునాయుడికి వెన్నతో పెట్టిన విద్య’ ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సూపర్ సిక్స్ పేరుతో హామీలు గుప్పించి అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు అండ్ కో గడిచిన ఆరు నెలలుగా రాష్ట్రంలో ఏదో ఒక అంశాన్ని చర్చకు వచ్చేలా చూడటం.. ఆపై మాటల దాడి చేయడం పరిపాటిగా మారింది. సంక్షేమ పథకాలపై జనం ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో ఎప్పటికప్పుడు అస్పష్ట ప్రకటనలు గుప్పిస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
ఒక ఇంటిలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం పథకం ద్వారా అందిస్తామని ఎన్నికల సమయంలో ప్రచారాన్ని హోరెత్తించిన కూటమి నాయకులు గద్దెనెక్కిన తర్వాత కిమ్మనడం లేదు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గురించి పరిశీలిస్తున్నామని, ఇప్పుడు అమలు చేయలేమంటూ చేతులెత్తేశారు. ఇవే కాకుండా రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.20 వేలు, మహిళలకు ప్రతి నెలా రూ.1500, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి హామీలను అటకెక్కించేశారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని సైతం సక్రమంగా అమలు చేయకుండా ఈ ఏడాదికిగాను ఒక సిలిండర్‌కే పరిమితం చేయడం ‘కూటమి’ సర్కారు మోసాన్ని తేటతెల్లం చేసింది.
కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఓ ప్రణాళికను రూపొందించి ఊహల్లో అభివృద్ధిని చూపేందుకు యత్నిస్తోంది. అయితే కూటమి నిర్దేశించుకున్న అన్ని రంగాల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ఉదాహరణకు వైద్య రంగంలో వైద్యుల నుంచి పారమెడికల్ పోస్టుల వరకు వేలాది ఉద్యోగాలు భర్తీ చేసి మెరుగైన సేవలు అందించారు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఇంటింటికీ వైద్య సేవలు దగ్గర చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భవిష్యత్తులో స్పెషలిస్టు డాక్టర్ల సంఖ్యను పెంచి పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఏకంగా 17 వైద్య కళాశాలలు నెలకొల్పారు. అందులో మార్కాపురం మెడికల్ కాలేజీ ఒకటి. కూటమి సర్కారు ఆ కాలేజీని నిలిపేసి పేద విద్యర్థుల కలలను చిదిమేసింది. ఇంటింటికీ వైద్యాన్ని నిలిపేసింది. అత్యవసర మందుల సరఫరాకు కొర్రీలు వేస్తోంది. ఆరోగ్యశ్రీ సేవలను పేదలకు దూరం చేసి రోగులు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు చూసేలా బలవంతపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్యా రంగంలో గత ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.వందల కోట్లు కేటాయించి పాఠశాలల రూపు రేఖలు మార్చింది. విద్యార్ధులకు స్కూల్ డ్రెస్ నుంచి బూట్లు, డిజిటల్ క్లాస్ రూములు, నాణ్యమైన పౌష్టికాహారం వంటి సౌకర్యాలు ఉచితంగా కల్పించడంతో పాటు అమ్మవడి పథకం ద్వారా తల్లులకు ఏడాదికి రూ.15 వేలు అందజేసింది. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అస్పష్ట ప్రకటనలకే పరిమితమైంది.
వ్యవసాయ, అనుబంధ రంగాలకు వైఎస్సార్ సీపీ పాలన స్వర్ణ యుగంలా నడిచింది. రైతు భరోసా పథకంతో ఏటా పెట్టుబడి సాయం అందించడంతోపాటు పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను అక్కున చేర్చుకుంది. కూటమి ప్రభుత్వంలో రబీ, ఖరీఫ్ సీజన్‌కు పెట్టుబడి సాయం అందక రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తల్లికి వందనం.. ఎగనామం
రైతులకు భరోసా ఏదీ?
చతికిలపడ్డ వైద్య రంగం
Comments
Please login to add a commentAdd a comment