రాజ్యాంగాన్ని అవహేళన చేశారు
● కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై ధ్వజమెత్తిన వామపక్ష నాయకులు
ఒంగోలు టౌన్: దేశ ప్రజల మధ్య అంతరాలు తగ్గించేందుకు కృషి చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను అవమానించడమంటే రాజ్యాంగాన్ని అవహేళన చేయడమేనని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ విమర్శించారు. అంబేడ్కర్‌ను అవమానిస్తూ హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం ప్రకాశం భవనం వద్ద వామపక్ష పార్టీలు ధర్నా చేపట్టాయి. ఈ నిరసనకు సీపీఐ, సీపీఎం నగర నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎం.రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను పార్లమెంటులోనే అవమానిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఇప్పటి వరకు ప్రధాన మంత్రి మోదీ ఖండించక పోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలను పౌరులంతా వ్యతిరేకిస్తున్నారని, ఆయన రాజీనామా చేసి మంత్రి వర్గం నుంచి పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఎంఎల్ నాయకురాలు ఎస్.లలిత కుమారి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ ముష్కరులకు తొత్తులుగా వ్యవహరించిన సావర్కర్ వారసుల వ్యవహార శైలిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్దాంతాలకు అనుగుణంగానే అమిత్ షా తప్పుడు వ్యాఖ్యలు చేశారని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసి రాష్ట్ర నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. నిరసన లో వామపక్ష పార్టీల నాయకులు బి.పద్మ, ఎం.విజయ, ఆర్.లక్ష్మి, కంకణాల రమాదేవి, ఎంఏ సాలార్, బాలకోటయ్య, బి.రఘురాం, ఆంజనేయులు, ఏవీ పుల్లారావు, సాయన్న, వీరారెడ్డి, ఆర్.వెంకటరావు, జయంత్‌బాబు, కోటేశ్వరరావు, శ్రీరాం శ్రీనివాసరావు, కరవది సుబ్బారావు, జాలా అంజయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment