దర్శి: నగర పంచాయతీ పరిధిలోని శివరాజనగర్ శివనాగసాయి దత్తాశ్రమం పక్కన కొండపై గుప్త నిధుల కోసం 15 అడుగుల లోతు తవ్విన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..కొండపై గోపిశెట్టి వెంకటశివప్రసాద్ అనే వ్యక్తి వారాహి అమ్మవారి చిన్న గుడిని నిర్మించి అక్కడకు రోజూ వెళ్లి పూజలు, ధ్యానం చేస్తుంటాడు. శివప్రసాద్ స్నేహితుడు యరమల నారాయణరెడ్డి అనే వ్యక్తి రోజూ అక్కడకు వచ్చి కూర్చుంటాడు. అదే కొండపై ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది. ఈ గుడిలో పూజారిగా పసుపులేటి వెంకటేశ్వర్లు పని చేస్తున్నాడు. శివప్రసాద్‌కు వారాహి అమ్మవారు కలలో కనిపించి నా బంగారు విగ్రహం కొండ కింద ఉంది.. ఆ విగ్రహాన్ని బయటకు తీసి పూజలు చేయమని చెప్పినట్లు పసుపులేటి వెంకటేశ్వర్లు.. యరమల నారాయణరెడ్డికి చెప్పి పది రోజుల నుంచి దర్శి పట్టణానికి చెందిన షేక్ ఖాశీం, షేక్ లాలూ అనే ఇద్దరు కూలీల సాయంతో సుమారు 15 అడుగుల వరకు కొండపై గుంత తవ్వారు. సీఐ రామారావు, ఎస్సై మురళిలు కొండ ప్రాంతంలో డ్రోన్ కెమెరా ఎగుర వేయగా కింద నుంచి 80 అడుగుల ఎత్తులో కొండపై తవ్వుతున్నట్లు గుర్తించారు. పోలీసులు వెళ్లడంతో పారిపోయేందుకు ఐదుగురూ ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఎస్సై మురళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్‌ఐలు రాంబాబు, శ్రీనివాసరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శివశంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment