కార్యకర్తలకు అండగా ఉంటా
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటానని, ఆయన ఆదేశాలను మనమందరం కలిసి పాటించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన త్రిపురాంతకం మండల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం అధికారంలో లేమని అధైర్య పడాల్సిన అవసరంలేదని, ప్రజల పక్షాన నిలబడి పోరాడే శక్తి అందరికీ ఉందని అన్నారు. త్వరలో ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని అవి తక్షణమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుందామన్నారు. నూతన కమిటీల నియామకాలు కార్యకర్తల నిర్ణయాలతోనే జరుగుతాయని చెప్పారు. ఏకపక్షక్షంగా నాయకుడి ఎంపిక ఉండదని, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యమాలు చేపట్టే సత్తా ఉన్న వారినే ఆయా మండలాలకు నాయకత్వం వహించే అర్హత కల్పిస్తామని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, ఆయా ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులతో చర్చించి ఆమోదయోగ్యమైన వ్యక్తిని మండలాధ్యక్షునిగా నియమిస్తామని తెలిపారు. మండలానికి నాయకత్వం వహించేందుకు ఎటువంటి అర్హత ఉందో ముందుగా సమావేశంలో చెప్పాలని, ఆ తరువాత పోటీపడుతున్న నాయకుల గురించి విడివిడిగా కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. గ్రామాల్లో ఉన్న వ్యక్తిగత వర్గవిభేదాలు విడనాడి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, ఇష్టపడి పార్టీ కోసం కష్టపడేవారే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజల కోసం పోరాడేందుకు ఎంతదూరం అయినా వెళ్తానన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలుకు నోచుకోవడంలేదని, కూటమి నాయకులకు ఇచ్చిన సమయం కూడా దాటి పోయిందన్నారు. ఈ పథకాలు అమలు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్యమాలు చేపట్టే సమయం ఆసన్నమైందన్నారు. విద్యుత్ చార్జీల పెంపు, రేషన్ మాఫియాను అరికట్టడం, మద్యం బెల్డ్ షాపుల నుంచి పల్లెలను రక్షించేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని, వారిని ఉద్యమ బాటలో నడిపించేందుకు నాయకులు తమ సమయాన్ని కేటాయించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు మన నాయకుడు జగనన్న ఇచ్చే ప్రతిపిలుపునకు నాయకులు స్పందించాల్సి ఉంటుందని చెప్పారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు సింగారెడ్డి పోలిరెడ్డి, మాజీ ఎంపీపీలు కోట్ల సుబ్బారెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, జెడ్పీటీసీ జాన్‌పాల్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శేషం రంగబాబు, సర్పంచ్‌లు పొన్నం వెంకటలక్ష్మి, ఓబులరెడ్డి తిరుమలయ్య, మురారి గాలయ్య యాదవ్, గుడిమెట్ల రంగయ్య, పల్లె సరళ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment