ఉపాధిలో కక్కుర్తి..! | - | Sakshi
Sakshi News home page

ఉపాధిలో కక్కుర్తి..!

Published Wed, Feb 5 2025 1:21 AM | Last Updated on Wed, Feb 5 2025 1:25 AM

ఉపాధిలో కక్కుర్తి..!

ఉపాధిలో కక్కుర్తి..!

ఛానల్‌ వద్ద గతంలో పనిచేసినట్లు ఉన్న శిలాఫలకం

సింగరాయకొండ: జిల్లాలోని అన్ని మండలాల్లో సుమారు 4.37 లక్షల జాబ్‌కార్డులు ఉండగా అందులో 3.81 లక్షల జాబ్‌కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఈ ప్రకారం జిల్లాలో 8.10 మంది ఉపాధి హామీ పథకం కూలీలు ఉండగా వారిలో 6.77 లక్షల మంది కూలీలు యాక్టివ్‌గా ఉన్నారని ఆ శాఖ ఆన్‌లైన్‌ రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ఈ పథకంలో ఎక్కువ భాగం మట్టి పనిచేస్తేనే రేషియో ప్రకారం రోడ్లు, డ్రైనేజీల తదితర అభివృద్ధి పనులకు మెటీరియల్‌ నిధులు మంజూరవుతాయి. నిబంధనల ప్రకారం పనులు జరిగితే రూ.170 కోట్ల నిధులు వస్తాయి. దీంతో జిల్లా అధికారులు మట్టి పనులు చేయించాలంటూ గ్రామ స్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా మండల, గ్రామ స్థాయి అధికారులు పని ఒత్తిడితో నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని యంత్రాలతో చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

పాత వారితో రాజీనామాలు..

జిల్లాలో 729 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉండగా వారిలో 550 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేయించారు. అధికారులు సైతం సహకారం అందించడంతో తమకు నచ్చిన వారిని నియమించుకున్నారు. ఇప్పటి వరకూ 500 మంది వరకు కొత్తవారిని నియమించారు. మిగిలిన ఫీల్డ్‌ అసిస్టెంట్ల పోస్టులు ఆయా గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు కారణంగా నిలిచిపోయాయి. ఇంకా 179 మంది పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయని ఆయా శాఖ అధికారులే చెబుతున్నారు. కొత్తగా నియమించిన వారికి అరకొరగా శిక్షణ ఇచ్చారు. పనిచేసే సమయంలో వారు ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ప్రతి రోజు కూలీలు పనికి తీసుకుని రావాలని ఒత్తిడి చేస్తుండడంతో ‘‘ఏదో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా వస్తే డబ్బులు బాగా వస్తాయని వచ్చామని. ఈ విధంగా రోజుకు ఒకరిద్దరు మాత్రమే వస్తే మాకు డబ్బులు రావటం సంగతి ఏమో కానీ ఒత్తిడి పెంచితే రాజీనామానే శరణ్యమని బెదిరిస్తున్నారని’’ మండల స్థాయి అధికారులు వాపోతున్నారు. మొత్తానికి ఉపాధి హామీ పథకం జిల్లా అధికారులు, నాయకుల అత్యాశ కారణంగా అభాసుపాలయ్యే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చేసిన పనినే మళ్లీ...

ఉపాధి నిధులను స్వాహా చేసేందుకు అధికార పార్టీ నాయకులు గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులనే మళ్లీ చేయిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు మితిమీరిన జోక్యంతో పనులు పక్కదారి పడుతున్నాయి. ఉదాహరణకు సింగరాయకొండ మండలంలోని కనుమళ్ల పంచాయతీ చిన్నకనుమళ్ల ప్రాంతంలోని పీడర్‌ ఛానల్‌ను డి.కోటయ్య పొలం నుంచి కనుమళ్ల రోడ్‌ వరకు రూ.3.66 లక్షలతో 2022వ సంవత్సరం మే నెలలో అభివృద్ధి చేశారు. ఇప్పుడు తిరిగి అదే ఫీడర్‌ ఛానల్‌ను సింగరాయకొండ, కనుమళ్ల పంచాయతీకి చెందిన కూలీలతో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. వాస్తవానికి ఈ ఫీడర్‌ ఛానల్‌ను రాత్రి వేళ జేసీబీతో పనిచేయించి తెల్లవారి కూలీలతో పనిచేయిస్తున్నట్లు ఉందని అక్కడి పరిస్థితిని చూస్తే అలాగే ఉందని ఆప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు.

రూ.170 కోట్ల మెటీరియల్‌ నిధులు మింగేందుకు యత్నం కూటమి నేతల గుప్పెట్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు యంత్రాలతో మట్టి పనులు చేసిన పనులనే మళ్లీ చేస్తూ నిధులు స్వాహా జోరుగా పొలం పనులు..ఉపాధికి కూలీల కరువు ఇళ్లలో ఖాళీగా వృద్ధులతో ఫొటోలు తీసి మమ అనిపిస్తున్న వైనం

జోరుగా పొలం పనులు

జిల్లాలో పొలం పనులు జోరుగా సాగుతున్నాయి. పొగాకు, వరి, కంది, శనగ పంటల కోతలు, నూర్పిడులు, పురుగుమందులు చల్లుకోవటం, కలుపు పీకడం వంటి పనులతో పాటు మామిడి, సపోట, జామ వంటి తోటల్లో పనులు ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ప్రకారం ఒకరోజు కూలీ రూ.500 నుంచి రూ.1000 వరకు ఉందని, దీంతో ఉపాధి పనులకు ఎలా వస్తామని కూలీలు చెబుతున్నారని గ్రామస్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక వీరు పనిచేయగానే ఏరోజు కారోజు కూలీ డబ్బులు వస్తాయన్నారు. అదే ఉపాధి పనికి వస్తే చేసిన పనిని బట్టి సుమారు రూ.150 నుంచి రూ.300 మాత్రమే వస్తాయని కూలీలు వివరించారు. జిల్లాలో ఉపాధి పని కింద యాక్టివ్‌గా పనిచేసే కూలీలు సుమారు 6.77 లక్షల మంది ఉండగా మూడు రోజులుగా కేవలం రోజుకు 3 వేల మంది మాత్రమే పని చేస్తున్నారు. జిల్లా అధికారుల పని ఒత్తిడి అధికంగా ఉండడంతో బయట కూలి పనికి వెళ్లకుండా ఇంట్లో ఉంటున్న ముసలి వారిని బతిమిలాడి తీసుకుని వచ్చి వారిని కూర్చోబెట్టి ఫొటో తీసుకుని పంపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement