కదిలొచ్చిన దేవదేవుడు
గడియారస్తంభం సెంటర్‌లో నగరోత్సవానికి వచ్చిన భక్తజన సందోహం
మార్కాపురం టౌన్: రథసప్తమిని పురస్కరించుకుని మంగళవారం మార్కాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు ఆలయం చుట్టూతా ఉన్న నాలుగు మాడవీధుల్లో సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తరహాలో రఽథసప్తమి వేడుకలు ఘనంగా జరగటంతో వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనం, శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, చంద్ర వాహనాలపై చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం స్వామి వారికి చక్రస్నానాన్ని అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, రంగాచార్యులు, వేణుగోపాలాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి తిరుమల తరహాలో స్వామి వారికి వెండితో తయారు చేసిన రథంపై చెన్నకేశవ స్వామివారిని ఉభయ దేవేరులతో కలిసి ప్రతిష్ఠించి నగరోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌పీ ఏఆర్ దామోదర్, సబ్‌కలెక్టర్ త్రివినాగ్, ఆలయ ఈఓ జీ.శ్రీనివాసరెడ్డి, ఉత్సవ సేవా సంఘం అధ్యక్షుడు యక్కలి కాశీవిశ్వనాథం, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సోదరుడు రామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, మాజీ ధర్మకర్తలు, ఉత్సవ సేవా సంఘం సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రత ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ వేషాలతో నృత్యాలు అలరించాయి. ప్రత్యేకంగా తీన్‌మార్ డప్పులు, కేరళ వాయిద్యాలు, వివిధ రకాల నృత్యాలతో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నారు.
సప్త వాహనాలపై మాడవీధుల్లో దర్శనమిచ్చిన చెన్నకేశవుడు ఘనంగా రథసప్తమి వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment