వేధింపులు
సచివాలయ ఉద్యోగులకు
ఉన్న గ్రామంలోనే ప్రజలకు అన్ని సేవలు అందించాలనే తపనతో గ్రామ స్వరాజ్య సాధన దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో గ్రామాల్లో అన్ని సేవలు సకాలంలో అందేవి. మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లకుండానే ప్రజలకు సేవలు అందడంతో వ్యయ ప్రయాసలు తప్పేవి. నేడు కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థనే నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
బేస్తవారిపేట: గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా దేశ చరిత్రలోనే ఎక్కడా ఎన్నడూ లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు ఉద్యోగవకాశాలు కల్పించింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకు, పరిపాలనను ప్రజల వద్దకే తీసుకొచ్చేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సచివాలయ వ్యవస్థను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సర్కార్ బ్రష్టు పట్టిస్తోంది. కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిదనే ముద్ర వేయాలన్న సామెతను నిజం చేసేలా.. సచివాలయ వ్యవస్థకే అపవాదులు అంటగడుతూ ఉద్యోగులు ఖాళీగా ఉన్నారంటూ ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తోంది.
సంబంధం లేని విధుల అప్పగింత
జాబ్ చార్ట్‌తో సంబంధం లేని విధులు అప్పగిస్తూ హీనంగా చూస్తున్నారని సచివాలయ ఉద్యోగులు లోలోన కుమిలిపోతున్నారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మథనపడుతున్నారు. రోజువారీ పనితో పాటు సర్వేలు, సమాచార సేకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి కారణంగా సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన కొద్దిరోజులుగా ఎంఎస్‌ఎంఈ సర్వే, పీఏసీ సర్వే, జియో ట్యాగింగ్ వంటి సర్వేల పేరుతో బండ చాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలులో సమగ్ర కుటుంబ సర్వే చేయించారు. కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తయిన సందర్భంగా వారం రోజుల పాటు గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటించే పని అప్పగించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. జిల్లాలో 12,442 మంది వలంటీర్లతో కలిసి 5 వేల మంది సచివాలయ ఉద్యోగులు చేస్తున్న పనులను కూటమి ప్రభుత్వంలో కేవలం ఉద్యోగులతో మాత్రమే చేయిస్తుండటంపై వారిలో అసంతృప్తి జ్వాల రగులుతోంది.
పింఛన్ల పంపిణీతో ఒత్తిడి
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్న చందంగా ఉంది కూటమి ప్రభుత్వ పరిస్థితి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారు జామునే వలంటీర్లతో ఠంఛన్‌గా పింఛన్ అందించారు. నేడు సచివాలయ ఉద్యోగులను తీవ్ర ఒత్తిడి పెట్టి పింఛన్లు పంపిణీ చేయిస్తున్నారు. తెల్లవారు జామునే మహిళా ఉద్యోగులు లక్షల నగదు తీసుకుని పంపిణీ కోసం వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. పట్టణాలు, నగర ప్రాంతాల్లో అక్కడకక్కడా విసిరేసినట్లు ఉండే గృహాల్లోని లబ్ధిదారుల వద్దకు వెళ్లాంలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. గతంలో వలంటీర్లకు 50 నుంచి 60 కుటుంబాలు మాత్రమే ఉండగా మూడు క్లస్టర్లు కలిపి అంటే సుమారు 150 నుంచి 200 కుటుంబాల బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించారు.
జాబ్‌చార్ట్ లేదు..ప్రమోషన్ చానల్ లేదు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్టుమెంట్, సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయలేదు. ప్రయోషన్ చానల్ ఏర్పాటు లేదు. సరైన జాబ్‌చార్ట్, పని వేళలు లేవు, సెలవులు అమలు లేవు, పబ్లిక్ హాలిడేస్, హెల్త్‌కార్డు, ఇన్సూరెన్స్ బాండ్స్ లేవు. ప్రభుత్వం వీటిపై స్పష్టత ఇవ్వకుండా ఒక మల్టీ పర్పస్ ఉద్యోగిగా వాడుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల మంది ఉద్యోగులు ఉండగా వ్యవసాయశాఖలో ఉన్న కేవలం 250 మందికి మాత్రమే పదోన్నతులు వచ్చాయి. అందరూ గ్రాడ్యుయేషన్, పోసు్ట్రగాడ్యుయేషన్, బీటెక్‌లు చదివి ఉద్యోగంలోకి వచ్చినవారే. వారందరినీ వలంటీర్ల స్థాయికి దిగజార్చే ప్రక్రియను ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం చేస్తుందనే భావన ఏర్పడుతోంది.
సచివాలయ సిబ్బందిపై దాడులు
మార్కాపురంలో శానిటరీ సెక్రటరీని మున్సిపల్ కమిషనర్ అసభ్యంగా దూషించాడు. దీనిపై సచివాలయ ఉద్యోగులు ధర్నా చేశారు.
ఒంగోలులో ఓ సభలో టీడీపీ నాయకుడు సచివాలయ ఉద్యోగులను తరిమితరిమి కొట్టండని బహిరంగానే మాట్లాడాడు. ఈ విషయంపై ఇప్పటికి ఉద్యోగులు తీవ్రమానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
కంభం మండలం చిన్నకంభంలో సచివాలయ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తొలగించి, సెక్రటరీపై దూసుకెళ్లి అసభ్యకరంగా టీడీపీ నేతలు మాట్లాడారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.
వంద రోజుల పాలన స్టిక్కర్లు అంటించిన ఉద్యోగులు
ఇప్పటికే ఒకరికి 150 నుంచి 200 కుటుంబాల పర్యవేక్షణ
మరుగుదొడ్ల ఫొటోల అప్‌లోడ్ బాధ్యత కూడా వారిదే
వలంటీర్లు చేసిన పనులన్నీ సచివాలయ ఉద్యోగులకే
పెరిగిన పనిభారం.. భవిష్యత్‌పై నో ధీమా
ఉద్యోగుల స్థాయి దిగజార్చేందుకు కుట్ర
రాజపూజ్యం సున్నా..అవమానం అధికం
కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనపై ఇంటింటికీ తిరిగి స్టిక్కర్లు అంటించడం, కరపత్రాలు పంచమనడంపై సచివాలయ ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు బహిరంగంగానే నిరసన తెలియజేస్తూ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్న ఇప్పటి ప్రభుత్వం వలంటీర్లతో స్టిక్కర్లు అంటించడాన్ని కోర్టులో సవాల్ చేసిందని, మరి ఇప్పుడు వలంటీర్లను విధుల్లోకి తీసుకోకపోగా ఉద్యోగులనే స్టిక్కర్లు అంటించే బాధ్యతలు ఎలా అప్పజెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు. తొలుత ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇవ్వమన్నారు. ఆ తర్వాత పాఠశాలల్లో టాయిలెట్ల ఫొటోలు తీయమన్నారు. ఇప్పుడేమో స్టిక్కర్లు అంటించి కరపత్రాలు పంచమంటున్నారు. వర్కింగ్ అవర్స్‌లో లైవ్ లోకేషన్ ఆన్‌లో ఉంచుకోవడంతో సెక్రటరీ పూర్తి ట్రాకింగ్ ప్త్రెవసీ అంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మిగిలిన శాఖల వారికి లేని దృష్టి సచివాలయ శాఖ మీదే ఎందుకు. ఎందుకింత లోతుగా ఒత్తిడి తీసుకొస్తున్నారో పాలకులకే ఎరుక. ఈ మధ్య తీవ్ర ఒత్తిడికి లోనై కొంత మంది సెక్రటరీలు అశువులు బాసిన సంఘటనలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment