తూతూమంత్రంగా కౌన్సిల్ సమావేశాలు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చించేందుకు ఆమడ దూరంలో ఉన్నట్లుందన్న చర్చ నగరంలో జోరుగా సాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కౌన్సిల్ సమావేశాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. మూడున్నర లక్షల జనాభా ఉన్న నగరంలోని ప్రజా సమస్యలు కోకొల్లలు. అయినా సమస్యలపై దృష్టి పెట్టని అధికార పార్టీ సభ్యులు, పాలకుల స్వప్రయోజనాలే ప్రధాన అంశంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. వైఎస్సార్ సీపీ జెండాపై మేయర్‌గా ఎన్నికై న గంగాడ సుజాత పార్టీ ఫిరాయించి ఆదాయమే పరమావధిగా అధికార టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు మరికొందరు కార్పొరేటర్లను వెంటేసుకొని మరీ వెళ్లారు. అప్పటి నుంచి నగరంలో అభివృద్ధి పనుల పేరుతో జరుగుతున్న వర్కుల్లో పర్సెంటేజీల వసూలు చేసుకుంటున్నారు. ప్రధానంగా కౌన్సిల్ సమావేశాల్లో జీరో అవర్‌ను ప్రవేశపెట్టి సభ్యులకు ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం కల్పించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కౌన్సిల్ సమావేశాల్లో అలాంటి సందర్భాలు కనుచూపుమేరలో కనబడలేదు. అజెండాలోని అంశాలపై హడావుడిగా చర్చించి జీరో అవర్ పేరుతో ఆయా అంశాలను ఆమోదింప చేసుకోవడంతోనే జీరో అవర్‌ను ముగిస్తున్నారు.
సమస్యలు చర్చించేందుకు
అవకాశం కల్పించాలి
సాధారణ సమావేశంలో ప్రధానంగా కమ్మపాలెం–దశరాజుపల్లె రోడ్డులోని కబరస్థాన్ అంశంపై లోతుగా చర్చించాలని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టనున్నారు. అధికార టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కబరస్థాన్ విషయంలో ముస్లింలకు అన్యాయం చేస్తున్నారన్న అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కూరగాయల మార్కెట్ ప్రాంగణం పక్కనే ఉన్న షాధీఖానా విషయంలో కూడా సభ్యులు లోతుగా చర్చించాలని పట్టుబడుతున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉంచాల్సిన షాధీఖానాను భారీ అద్దె వసూళ్ల దిశగా నగర పాలక సంస్థ అధికారులు అడుగులు ముందుకు వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా అంశాలపై సభ్యులకు లోతుగా చర్చించే అవకాశం కల్పించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
అత్యవసరంగా అజెండాల బట్వాడా
నగర పాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం అని చెప్పి సభ్యులకు అజెండాలను అత్యవసరంగా బట్వాడా చేయడం అధికారులపై విమర్శలు రేకెత్తుతున్నాయి. కౌన్సిల్ సమావేశమని అజెండాను సిద్ధం చేసిన అధికారులు జనవరి 27వ తేదీన మేయర్ గంగాడ సుజాతతో సంతకాలు చేయించారు. ఆ వెంటనే సభ్యులకు అజెండా కాపీలను పంపిణీ చేయాల్సి ఉంది. ఫిబ్రవరి ఒకటో తేదీన సభ్యులకు అజెండా కాపీలను బట్వాడా చేశారు. ఇందులో మతలబు దాగి ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం సభ్యులకు అజెండా కాపీలు అందజేసిన మరుసటి రోజు నుంచి వారం రోజుల తర్వాత కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలన్న నిబంధనను నగర పాలక సంస్థ అధికారులు తంగలో తొక్కారు. ఒకటో తేదీన అజెండా కాపీలు సభ్యులకు అందజేసిన అధికారులు కౌన్సిల్ సమావేశాన్ని ఫిబ్రవరి 7వ తేదీ తర్వాత నిర్వహించాల్సి ఉంది. కానీ ఐదు రోజులకే కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు ఉన్న మతలబు ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. సీడీఎంఏ నిబంధనలు పాటించకుండా నగర పాలక సంస్థ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కలెక్టర్ తమీమ్ ఆన్సారియా ప్రత్యేక దృష్టి సారించాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాలులో కౌన్సిల్ సాధారణ సమావేశం మేయర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు.
ప్రజాసమస్యలు చర్చించేందుకు
జీరో అవర్ కేటాయించని కౌన్సిల్
కూటమి నేతల అనుకూల అజెండాల ఆమోదమే ధ్యేయం
సాధారణ సమావేశమని అత్యవసరంగా సభ్యులకు అజెండాల బట్వాడా
అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్న అంశంపై సభ్యుల్లో ఆగ్రహం
కలెక్టర్ తమీమ్ అన్సారియా
కలుగజేసుకోవాలని డిమాండ్
నేడు ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment