నేరాల అడ్డుకట్టకు అవగాహనే అసలైన అస్త్రం
పెద్దదోర్నాల:
సైబర్ నేరాల అడ్డుకట్టకు అవగాహనే అసలైన అస్త్రమని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. పోలీసుస్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పెద్దదోర్నాల పోలీసుస్టేషన్‌ను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అవరణలోని గదులను, పాత పోలీస్ క్వార్టర్స్‌ను ఆయన పరిశీలించారు. ప్రజలు చేసే ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం పనికి రాదని, వాటిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, పట్టుబడిన ద్విచక్ర వాహనాల ఫైళ్లను, జనరల్ డైరీలను ఆయన పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ అర్డర్ నేర నివారణ, వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేశారు. పోలీసుస్టేషన్‌ల్లో పెండింగ్ కేసుల వివరాలు తెలసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు చేసి తక్షణమే ఫిర్యాదుదారులకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. మహిళా భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తమంగా ఉండాలని మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ప్రాధ్యాన్యం ఇవ్వాలన్నారు. పోలీసుస్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగ తనాలు జరగకుండా చూడాలని ఎస్పీ ఆదేశించారు. స్టేషన్‌లో పని చేస్తున్న సిబ్బంది వివరాలు, వారి విధులపై ఆరా తీశారు. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేసి గస్తీ పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. చెడు నడత కలిగిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, బీట్లు తిరిగే సమయంలో హిస్టరీ షీట్లు కలిగిన వారిని చెక్ చెయ్యాలని సూచించారు. వారి కదలికలపై నిఘా పెట్టి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. స్కూల్, కళాశాల విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, గంజాయితో కలిగే అనర్థాలు వివరించాలన్నారు. ఓటీపీ మోసాలు, ఇతర సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పించి వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసుకొనేలా ప్రజలను ప్రోత్సహించాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. ఎస్పీ వెంట మార్కాపురం డీఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాఘువేంద్ర, యర్రగొండపాలెం సీఐ ప్రభాకరరావు, ఎస్సై మహేష్ పాల్గొన్నారు.
నిందితులపై చర్యలు తీసుకోండి
యర్రగొండపాలెం: దాడి చేసిన నిందితుడిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పుల్లలచెరువు మండలం మానేపల్లి ఎస్సీ పాలేనికి చెందిన వారు ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు విన్నవించారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్ తనిఖీ చేసేందుకు వచ్చిన ఎస్పీని వారు కలిశారు. కొండ అశోక్‌పై అగ్రకులానికి చెందిన వారు దాడి చేసి వారం రోజులవుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితుడి తల్లిదండ్రులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వారికి హామీ ఇచ్చారు.
కేసుల్లో ఎటువంటి జాప్యం పనికి రాదు
బాధితులకు అండగా ఉండటం పోలీసుల విధి
రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి
పోలీసు అధికారులను ఆదేశించిన ఎస్పీ దామోదర్
Comments
Please login to add a commentAdd a comment