‘ధరణి’ని బంగాళాఖాతంలో కలిపినం
● రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ● వేములవాడ ఏఎంసీ ప్రమాణస్వీకారం
వేములవాడరూరల్: రైతుల శ్రేయస్సు కోసం ధరణికి బదులుగా భూభారతి చట్టం అమలు చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వేములవాడ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్, పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అన్నదాతల సమస్యలు పరిష్కరించేందుకే ధరణిని రద్దు చేసి భూభారతిని తీసుకొచ్చినట్లు తెలిపారు. జనవరిలో రైతుభరోసా ఇస్తామని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీకి మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పజెప్పితే, పదేళ్ల తర్వాత అప్పుల బడ్జెట్‌తో అప్పజెప్పారని విమర్శించారు. రూ.2లక్షలలోపు రుణమాఫీ జరిగిందని, రూ.2లక్షలకు పైగా ఉన్న వారికి కొంత జాప్యమైందన్నారు. వారికి కూడా త్వరలోనే రుణమాఫీ జరుగుతుందన్నారు. గ్రామాల్లో 80 నుంచి 90 శాతం ప్రజలు ఉచిత విద్యుత్ పొందుతున్నారని పేర్కొన్నారు.
అసెంబ్లీ కుటుంబ వేదిక కాదు
అసెంబ్లీ ఒక కుటుంబానికి సంబంధించిన చర్చావేదిక కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఫార్ములా ఈ–కార్ రేసింగ్ విషయంలో అసెంబ్లీలో చర్చ పెట్టలేదని, వాళ్లు చర్చ కోరితే సమాధానం చెప్పేవాళ్లమన్నారు. అంబేడ్కర్‌ను అవమానపరిచిన అమిత్‌షా విషయంలో పురందేశ్వరీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
రైతులకు అండగా నిలవాలి
మార్కెట్ కమిటీలు రైతులకు అండగా నిలవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. ఆనాడు రైతులు ఇబ్బందులు పడుతుంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని గుర్తుచేశారు. రైతులు పండించిన సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చామన్నారు. రాజన్న సొమ్ము నయా పైసా కూడా వృథా కాకుండా ఆలయ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్‌చైర్మన్ బింగి మహేశ్, సెస్ డైరెక్టర్ నామాల ఉమ, వకుళాభరణం శ్రీనివాస్, పాలకుర్తి పర్శరాములు, దైత కుమార్, గుర్రం విద్యాసాగర్, చెరుకు శంకర్, మానుపాటి పర్శరాములు, వస్తాద్ కృష్ణ, ఖమ్మం గణేష్, రంగు వెంకటేశం, చిలుక రమేశ్, సాగరం వెంకటస్వామి, సోయినేని కరుణాకర్, తోట రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment