గమ్యానికి చేరువై.. అంతలోనే దూరమై..
గోదావరిఖని(రామగుండం): మరో నిమిషంలో ఇంటికి చేరుకునేవారు.. ఇంకో రెండుగంటలు గడిస్తే భోగి పండుగతో ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిసేవి. ఈలోగా మృత్యువు ముంచుకొచ్చింది. కుటుంబానికి పెద్దదిక్కు, అతడి కొడుకు మృతిచెందడం, ఇల్లాలు ఆసుపత్రి పాలు కావడంతో ఖనిలో విషాదఛాయలు నెలకొన్నాయి. సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు, అతడి కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాలు..
జీడీకే–11గనిలో పనిచేస్తున్న గిన్నారపు సతీశ్(32) తనకు వరుసకు సోదరుడు అయిన వ్యక్తికి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కొడుకు జన్మించాడు. వారిని చూసేందుకు ఆదివారం సతీశ్ తన భార్య కీర్తి, కుమారుడు నవీశ్(11నెలలు), బావ ఎ.సతీశ్, చెల్లె అనూషతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లారు. తిరిగి రాత్రి 11 గంటలకు గోదావరిఖనికి పయనమయ్యారు. ఎన్టీపీసీ బీ పవర్‌హౌజ్ వరకు తన బావ కారు డ్రైవ్ చేయగా అక్కడ కొద్ది సేపు మూత్ర విసర్జన కోసం ఆగారు. తర్వాత సతీశ్ డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. ఈక్రమంలో సోమవారం వేకువజామున 3గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చేసరికి కుక్క అడ్డు రావడంతో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనగా, సతీశ్, అతడి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య, బావ, చెల్లె గాయాలపాలయ్యారు.
ఒక్క నిమిషం గడిస్తే..
ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సతీశ్ ఇల్లు ఐదువందల మీటర్ల దూరంలో ఉంది. ఒక్క నిమిషం గడిస్తే ఇంటికి చేరుకునేవారు. ఈలోగా జరిగిన ప్రమాదం సింగరేణి యువ కార్మికుడు, అతడి ముక్కుపచ్చలారని 11నెలల చిన్నారిని కబలించింది. తన ఎదపైన ఆడాల్సిన చిన్నారి బాబును పోస్టుమార్టం అనంతరం తండ్రి మృతదేహంపై పడుకోబెట్టిన దృశ్యం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. అంత్యక్రియల కోసం మృతదేహాలను తిమ్మాపూర్ మండలం పోరండ్లకు తరలించారు.
కుక్క అడ్డు రావడంతో
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
సింగరేణి కార్మికుడు, అతడి కుమారుడు మృతి
మృతుడి భార్య, బావ, చెల్లికి గాయాలు
పండుగ పూట విషాదం
Comments
Please login to add a commentAdd a comment