ఆర్టీఏలో ‘ప్రైవేట్ దందా’
● ధనార్జనే ధ్యేయంగా పీఏల నియామకం ● అనధికారికంగా విధులు ● వారు చెప్పిందే రేటు.. చూపించిందే ఫైలు ● పైసలు ముడితేనే ఫైలు ముందుకు.. ● వాటాలవారీగా పంపకాలు ● ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
సిరిసిల్లక్రైం: జిల్లా రోడ్డు రవాణాశాఖ(ఆర్టీఏ)లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం పెరిగిపోయింది. చిన్న పని కోసం కార్యాలయానికి వెళ్తే పీఏలుగా చెప్పుకునే ప్రైవేట్ వ్యక్తులను ప్రసన్నం చేసుకుంటేనే ఆ ఫైలు ముందుకెళ్తుంది. లేదంటే రోజులకొద్దీ ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిందే. లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ వరకు అన్ని పనులు పీఏలుగా చెప్పుకునే వ్యక్తులే చక్కదిద్దుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేట్ అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని పీఏల వ్యవహారం సిరిసిల్లలో నడుస్తోంది.
ప్రతీ పనిలో వాటాలు
లర్నింగ్ డ్రైవింగ్, పర్మినెంట్ డ్రైవింగ్, వాహనాల ఫిట్‌నెస్ వంటి సేవల కోసం వచ్చే ప్రజల నుంచి బ్రోకర్లు వాటాలవారీగా డబ్బులు డిమాండ్ చేయడం ఇక్కడ పరిపాటి. అయితే ఏ పనికి ఎంత అనేది ముందుగా ఆర్టీఏ అధికారులే నిర్ణయించి, కోడ్ రూపంలో ఏజెంట్లకు చెప్పినట్లు తెలిసింది. ఇలా వివిధ పనుల కోసం ఆఫీస్‌కు వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేసి వారానికోసారి అధికారులకు ముట్టజెప్పుతారని సమాచారం. ఆ మాముళ్లలో 10 నుంచి 20 శాతం అనధికారిక పీఏలు తీసుకుని మిగతా సొమ్మును అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిసింది. ఆమ్యామ్యాలు ముట్టజెప్పని వారి వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్ చేయకుండా ఏదో ఒక వంక పెట్టడం ఇక్కడ జరిగే వ్యవహారం.
అసలుకు అదనం కలిపి..
వాహనాలకు ఫిట్‌నెస్ చేయడానికి రూ.1,100 ఉంటే ఇక్కడ రూ.2వేలు తీసుకుంటున్నారు. అన్ని పనులు సక్రమంగా సాగాలంటే కిందిస్థాయిలో మరో రూ.200 అప్పగించాలి. కమర్షియల్ వాహనాలు నడిపే డ్రైవర్‌కు బ్యాడ్జి ఇవ్వాలంటే ప్రభుత్వ ఫీజు రూ.365 ఉంటే అదనంగా దీనికి రెండింతలు వసూలు చేస్తున్నారు. లర్నింగ్ డ్రైవింగ్ కోసం రూ.450 అధికారికంగా ఫీజు కాగా దీనికి అదనంగా మరో రూ.800 వసూలు చేస్తున్నారు. పర్మిట్ కోసం తీసుకునే ఫీజును రెండింతలు చేసేసుకున్నారు.
కోడ్ లేకుంటే కష్టాలు
ఆర్టీఏలో పనులు కావాలంటే ఏజెంట్లను కలవాలని జిల్లాలో అందరూ చర్చించుకుంటున్నారు. నిజానికి ఆర్టీఏలో ఏజెంట్ అనే విధానం లేదు. ఇదంతా ఆర్టీఏ అధికారులు ఆర్థికలావాదేవీల కోసమే మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్నారని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో దాదాపు 45 మంది వ్యక్తులు ఆర్టీఏ ఏజెంట్లుగా చలామణి అవుతున్నారు. వీరందరికీ ఆర్టీఏ ఆఫీస్ నుంచి కోడ్ ఉంటుంది. వారి వద్దకు వచ్చిన వారికి ఏదేని సేవలు నేరుగా అందాలంటే ఆ ఫైల్‌పై సదరు ఏజెంటు కోడ్ ఉండాల్సిందే. లేదంటే ఇక ఆ ఫైల్ ముందుకెళ్లదు. మామూళ్లు చెల్లించి కోడ్ వేసి రాగానే మళ్లీ అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయని అనేక మంది పేర్కొంటున్నారు.
ఆన్‌లైన్‌లోనే సేవలు
వాహనదారులు ఆన్‌లైన్‌లో రశీదు తీసుకొని వస్తే అన్ని సేవలు అందుతాయి. కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులకు ఆస్కారం లేదు. పీఏలు ఎవరూ లేరు. మధ్యవర్తిత్వం కోసం ఎవరైనా వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఏజెంట్లుగా చలామణి అవుతున్న వారందరూ బయట జిరాక్స్ సెంటర్లు, ఆన్‌లైన్‌లో నమోదుచేసే వాళ్లే. వారితో మా కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు.
– లక్ష్మణ్, డీటీవో, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment