ఆత్మీయ భరోసాకు సిద్ధం
● నేటి నుంచి పల్లెల్లో గ్రామసభలు ● ఉపాధిహామీ కనీస పనిదినాలు 20గా నిర్ధారణ ● కూలీల వివరాల అప్‌లోడ్‌లో సమస్యలు ● భోగి, సంక్రాంతి రోజూ 20 గంటలు పని చేసిన ఉద్యోగులు ● గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆరోపణలు.. ఇప్పుడూ వారే కీలకం ● 100 శాతం పూర్తయిన ఆధార్ సీడింగ్ ● ఉమ్మడి జిల్లాలో 8,77,798 మంది కూలీలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు అందించే సంక్షేమ పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అంతా సిద్ధమైంది. వ్యవసాయ భూమి లేని కూలీలుగా పనిచేస్తున్న వారందరికీ 2 పంటల సమయంలో రూ.6వేల చొప్పున అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో నమోదైన కూలీలను ఎంపిక చేయనుంది. ఇందుకోసం కనీసం ఏడాదిలో 20 రోజులైనా ఉపాధిహామీ పనిచేసి ఉండాలన్న నిబంధన విధించింది. ఈక్రమంలో అన్ని జిల్లాల్లో ఉపాధిహామీ జాబ్‌కార్డుల ప్రక్షాళనకు అధికారులు నడుం బిగించారు. ఇందుకోసం వ్యవసాయ కూలీల ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తున్నారు. అనర్హుల గుర్తింపు, డబుల్ కార్డులు, 20 రోజుల్లోపు పని చేసినవారి వివరాలు గ్రామాల వారీగా జాబితా రూపొందించి, తిరిగి అప్‌లోడ్ చేస్తున్నారు.
కూలీల గుర్తింపు సాగుతోందిలా..
ఉపాధి హామీ కూలీల డేటా మొత్తం ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఇందులోని వివరాలను డీఆర్‌డీవో అధికారులు ముందుగా డౌన్‌లోడ్ చేస్తున్నారు. కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఉంటుంది. అందులో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సభ్యులు ఉండవచ్చు. తర్వాత స్థానికంగా ఉన్న కూలీల వివరాలను, ఆధార్‌కార్డులతో అప్‌డేట్ చేస్తున్నారు. అంటే ప్రతీ కూలీ పేరు, ఆధార్ కార్డు నంబర్, జాబ్‌కార్డు, బ్యాంకు ఖాతా తదితర వివరాలు సరిగా ఉన్నాయో లేదా తనిఖీ చేస్తున్నారు. అంతేకాదు, కొత్తగా ఎవరైనా కూలీలు చేరారా? పాత వారు స్థానికంగా ఉంటున్నారా? ఎవరైనా మరణించారా? పెళ్లి చేసుకొని వెళ్లిపోయారా? తదితర వివరాలను వాస్తవ వివరాలతో సరిపోలుస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌ఐసీ వెబ్‌సైట్ నుంచి ఒక్కో గ్రామం వివరాలను డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అధికారులకు ఇబ్బందిగా మారింది. సర్వర్‌లో బిజీ కారణంగా ఒక్కో డేటా డౌన్‌లోడ్ అయ్యేందుకు, దాన్ని తిరిగి మరో కొత్త ఎక్సెల్ షీట్‌లో పొందుపరిచి, రాష్ట్ర వెబ్‌సైట్(సీఎంఎస్)లో పొందుపరిచేందుకు కనీసం గంట వరకు సమయం పడుతోంది.
అధికారులకు పనిభారం
ఎన్‌ఐసీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న సమాచారాన్ని తిరిగి మూడు దశల్లో క్రాస్ చెక్ చేస్తున్నారు. మొదటిది దశలో వలస వెళ్లిన, పెళ్లి చేసుకున్న, చనిపోయిన, డబుల్ కార్డులను రిజెక్ట్ చేస్తున్నారు. రెండో దశలో రిజెక్ట్ అయిన వివరాలను ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేస్తున్నారు. మూడో దశలో వివరాలను డీఆర్‌డీవో టెక్నికల్ బృందం స్టేట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తోంది. ఇది అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం కావడంతో ఉన్నతాకారులు ప్రతీ గంటకు పనిలో పురోగతిని అడుగుతున్నారు. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు రోజులో దాదాపు 12 గంటలకు పైగా కంప్యూటర్లకే అతుక్కుపోతున్నారు. 16వ తేదీ నాటికి ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని టార్గెట్ విధించడంతో సంక్రాంతి రోజు కూడా పని చేయాల్సి వచ్చింది. చాలామంది భోగి రోజు ఏకంగా 20 గంటలపాటు పని చేశారు. సంక్రాంతి, కనుమ రోజు కూడా చాలా మంది పని చేయాల్సి వచ్చింది.
ఉమ్మడి జిల్లాలో ఉపాధిహామీ వివరాలు
కరీంనగర్
జగిత్యాల
పెద్దపల్లి
సిరిసిల్ల
2,96,756
2,73,000
1,68,000
1,88,980
1,54,768
1,19,062
1,19,011
98,006
ఆధార్ సీడింగ్ 100 శాతం
‘తప్పుడు హాజరు’పై ఆందోళన..
లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 16 నుంచి అన్ని జిల్లాల్లో గ్రామసభలు నిర్వహిస్తారు. ఇందులో 20 రోజులు కనీస పనిదినాలు అర్హతగా నిర్ధారించి, తుది జాబితా రూపొందిస్తారు. అభ్యంతరాలు లేకపోతే దాన్నే ఖరారు చేస్తారు. అయితే, ఉపాధిహామీ పథకంలో గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు అనేక కుంభకోణాలు చేశారన్న ఆరోపణలున్నాయి. కూలీల హాజరు, పని వివరాలు వీరి చేతిలో ఉండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలులోనూ వీరే కీలకం కానున్నారు. కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధిహామీ పనికి రాని వారికి కూడా తప్పుడు హాజరుతో పథకం వర్తింపజేస్తారన్న ఆందోళన ఉన్నతాధికారుల్లో ఉంది. దీన్ని వీలైనంతగా నివారించేందుకు అప్రమత్తంగా ఉంటున్నారు. అదే సమయంలో ఆధార్ సీడింగ్‌ను 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేయడంతో ఆధార్‌కార్డుల్లో పేరు తప్పులు, అక్షర దోషాలకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment