● వేడినీటికీ.. తాగునీటికీ తిప్పలు
ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థులు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఆర్‌ఓ ప్లాంట్ చెడిపోవడంతో మంచినీటిని రోజూ కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ 35 మంది విద్యార్థులు ఉన్నారు. గత నెలలో అవసరమైన బెడ్‌షీట్లు, బ్లాంకెట్లు అందించారు. ఇటీవల తలుపులు, కిటికీలను బాగుచేశారు. ఆర్‌ఓ ప్లాంటు చెడిపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతులు జరిపించడం లేదు. ఉదయం పూట స్నానాలకు వేడినీరు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వసతిగృహం భవనంపై సోలార్ గీజర్ ఏర్పాటు చేయగా పనిచేయకపోవడంతో వేడినీటి వసతి లేకుండా పోయింది. భవనం చుట్టూ రాత్రి వేళ చీకటి ఉండటంతో విద్యార్థులు భయపడుతున్నారు.
వేడినీటి వసతి కల్పించాలి
చలికాలం కావడంతో స్నానానికి వేడినీటి వసతి కల్పించాలి. ఆర్‌ఓ ప్లాంట్‌కు మరమ్మతులు చేయించాలి. ప్రతిరోజూ నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కోసారి సమయానికి రాక ఇబ్బందులు పడుతున్నాం. – శ్రీధర్, హాస్టల్ విద్యార్థి
గీజర్లులేక తప్పని వణుకు
మహేశ్వరం: మండలంలోని బీసీ, ఎస్టీ, ఎస్సీ హాస్టళ్లలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు బెడ్‌షీట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కానీ మూడు హాస్టళ్లలో గీజర్లు లేకపోవడంతో చలికాలం ఉదయం పూట చన్నీటితో స్నానం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ హాస్టల్‌లో 70 మంది, ఎస్టీ హాస్టల్‌లో 95 మంది, బీసీ హాస్టల్‌లో 75 మంది విద్యార్థులు ఉన్నారు. బీసీ, ఎస్సీ హాస్టళ్లలో గీజర్లు మొత్తమే బిగించలేదు. ఎస్సీ హాస్టల్‌లో ఉన్నా మరమ్మతులకు గురైంది. కొంతమంది విద్యార్థులు దుప్పట్లు ఉన్నా చలికి తట్టుకోలేక ఇంటి నుంచి తెచ్చి కప్పుకొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment