పడిగాపులు
చేవెళ్ల: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు పత్తి రైతులు నానా పాట్లు పడాల్సి వస్తోంది. సీసీఐ కేంద్రాల వద్ద రోజుకు ఇంతే కొంటామనే పరిమితి విధించడంతో రైతులకు రోజుల తరబడి మిల్లుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. చేవెళ్ల మండలంలోని శ్రీనివాస కాటన్‌మిల్లు వద్ద ప్రభుత్వం నెల రోజుల కిత్రం సీసీఐ కోనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. డివిజన్‌తోపాటు చుట్టు పక్కల మండలాల రైతులు సైతం పత్తిని అమ్ముకునేందుకు వస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 1000 క్వింటాళ్లకుపైగా తీసుకువస్తున్నారు. కానీ ఇక్కడ రోజుకు 500 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేయాలనే పరిమితి విధించారు. దీంతో సగం మంది రైతులు ప్రతిరోజు కోనుగోలు కేంద్రం వద్ద ఇబ్బందులు పడుతున్నారు. పరిమితి దాటిపోతే మరుసటిరోజు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వాహనాల అద్దెలు రెట్టింపు అవుతున్నాయి.
ఎలా అమ్ముకునేది..?
పండించిన పంటను అమ్ముకోవాలంటే నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. పరిమితి లేకుండా రోజు వారీగా వచ్చిన రైతులవి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారంలో శని, ఆదివారాలు సెలవు ఉండటంతో పాటు మిగతా ఐదు రోజుల్లో ఏ సమస్య వచ్చినా ఇబ్బంది తప్పడం లేదని అంటున్నారు. నడిచే మూడు నాలుగురోజులు కూడా నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లు వద్ద సరైన సిబ్బంది లేకపోవడంతో ఆలస్యం అవుతోందని, తెచ్చిన పత్తిని ఎలా అమ్ముకోవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, వ్యవసాయ, సీసీఐ అధికారులు స్పందించి కొనుగోలు పరిమితిని పెంచాలని, రోజుకు కనీసం 1000 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతించాలని కోరుతున్నారు.
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ని‘బంధనాలు’
రోజుకు 500 క్వింటాళ్లే కొనుగోలు
పరిమితి దాటితే తప్పని నిరీక్షణ
ఆందోళనలో పత్తి రైతులు
అదనపు భారం పడుతోందని ఆవేదన
పొద్దుగాళ్ల వస్తే పొద్దీకే..
రెండు ఎకరాల్లో పత్తి పంట వేశాను. వచ్చిన పత్తిని అమ్ముకునేందుకు రూ.2వేల కిరాయి పెట్టి వాహనంలో వచ్చాను. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి బండి లైన్‌లో పెట్టాను. సాయంత్రం అయినా కొనుగోలు చేయలేదు. ఒకరోజు దాటితే మరోరోజుకు రూ.2వేలు అదనంగా కిరాయి పడుతుంది.
– ఎం.జంగయ్య, రైతు, దామరగిద్ద
పరిమితి ఎత్తివేయాలి
ఏడాదికాలం సాగు చేసిన పత్తిని అమ్ముకునేందుకు వస్తే అడుగడుగున్నా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. నేరుగా అమ్ముకునేందుకు ఏర్పాట్లు లేకపోవటం బాధాకరం. ఓవైపు ధర తక్కువ చేసి.. మరోవైపు పరిమితి విధించడం సరికాదు. కొనుగోలుకు విధించిన పరిమితిని ఎత్తి వేయాలి.
– విష్ణుబాబు, రైతు, రామన్నగూడ
అనుమతి మేరకు కొంటున్నాం
చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రానికి రోజుకు 500 క్వింటాళ్ల పరిమితి మాత్రమే ఉంది. మిల్లు కెపాసిటీ మేరకు అధికారులే ఇలా నిర్ణయించారు. అయినా రైతులకు ఇబ్బంది లే కుండా 700 క్వింటాళ్ల వరకు కొంటున్నాం. అంతకు మించితే ఉన్నతాధికారులు, సీసీఐ నుంచి అనుమతి రావాలి.
– మహేందర్, మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి, చేవెళ్ల
Comments
Please login to add a commentAdd a comment