అట్టుడికిన కలెక్టరేట్
ఇబ్రహీంపట్నం రూరల్: మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాతో కలెక్టరేట్ అట్టుడికింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ చేపట్టిన 48 గంటల ధర్నా విజయవంతమైంది. కార్మికుల నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం మార్మో గింది. ముఖ్యమంత్రి డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కలెక్టరేట్ గేట్ల ముందు బైఠాయించారు. కార్యాలయంలోకి కార్లు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్న పానీయాలు మాని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇప్పటికే మధ్యాహ్న భోజనం కార్మికులు అప్పులపాలయ్యారని, పుస్తెలు తాకట్టు పెట్టి వంటలు వండి పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. ధర్నా చేస్తుండగా బాటసింగారం గ్రామానికి చెందిన మధ్యాహ్న భోజనం కార్మికురాలు లలిత సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆమెను కలెక్టరేట్‌లోని ఆస్పత్రికి తరలించి వైద్యసాయం అందించారు. అక్కడి నుంచి 108 వాహనాన్ని పిలిపించి మెరుగైన వైద్యం కోసం తరలించారు.
హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేసిన కార్మికులు కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని నినదించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో విద్యాశాఖ అడిషనల్ డీఈఓ వచ్చి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రెండు నెలల బిల్లులు ఖాతాల్లో పడ్డాయని మిగతావి త్వరలో వస్తాయన్నారు. బ్యాంకుల్లో, లేదా ఎస్టీఓల్లో అగి ఉంటాయేమోనని, తప్పకుండా వస్తాయని హామీ ఇచ్చారు. దీంతో వారు పది రోజుల్లో సమస్య పరిష్కారం కాకుంటే మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరించి విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పోచమోని కృష్ణ, రుద్రకుమార్, పెంటయ్య, సరిత, అలివేలు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
వాహనాలు రాకుండా గేట్లకు అడ్డు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
సొమ్మసిల్లి పడిపోయిన ఓ కార్మికురాలు
Comments
Please login to add a commentAdd a comment