ఆశల రేషన్!
సాక్షి, సిటీబ్యూరో: ‘సంక్రాంతి పండగ తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చేస్తాం’ .. అసెంబ్లీ సాక్షిగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన ప్రజాపాలనలో పేద కుటుంబాలు ఆరు గ్యారంటీల పథకాలతో పాటు ప్రత్యేకంగా రేషన్ కార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నాయి. అయినా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేకుండా పోయింది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని ప్రకటించారు. అప్పట్లో లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చింది.. ముగిసింది. కానీ.. ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. పేదలు మాత్రం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వం మరోసారి హామీ ఇవ్వడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై ఆశలు చిగురిస్తున్నాయి.
ఆన్‌లైన్ ద్వారానే..
● పౌరసరఫరాల శాఖ సంస్కరణలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా సేవలు ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్ లాగిన్ ద్వారానే దరఖాస్తులను స్వీకరించి కొత్త కార్డులను మంజూరు చేస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో ఆహార భద్రత కార్డులుగా మార్పు చేసింది. కొత్త కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి కొద్దికాలం జారీ పక్రియ కొనసాగించింది.
● నాలుగేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల చేసుకునే పౌరసరఫరా శాఖ వెబ్‌సైట్ ఆన్‌లైన్ లాగిన్‌ను నిలిపివేసి అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో కేవలం 40 శాతం మాత్రమే క్లియర్ చేసి మిగతా దరఖాస్తులను తిరస్కరించింది. అప్పటి నుంచి కొత్త కార్డుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా లేకుండాపోయింది. తాజాగా ఆ లాగిన్ పునఃప్రారంభమై గ్రీన్ సిగ్నల్ లభిస్తే దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి
మొత్తం 40 లక్షల కుటుంబాలు..
నగరంలో సుమారు 10 లక్షల కుటుంబాలకుపైగా రేషన్ కార్డులు లేవు. సుమారు కోటిన్నర జనాభా ఉన్న భాగ్యనగరంలో దాదాపు 40 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలు 27.21 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం హైదరాబాద్–రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో 17.21 లక్ష కుటుంబాలు మాత్రమే తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. మిగతా కుటుంబాలు రేషన్ కార్డులు లేక వివిధ సంక్షేమ పథకాల వర్తింపు కోసం తల్లడిల్లుతున్నాయి.
సంక్రాంతి తర్వాత నయా కాంతులేనా!
కొత్త రేషన్ కార్డులపై పేదల ఆశలు
ఏడాదిగా మీ సేవ చుట్టూ చక్కర్లు
అంతకుముందు ఆరేళ్లూ ఇదే దుస్థితి
గ్రేటర్‌లో 10 లక్షలకుపైగా కుటుంబాల ఎదురుచూపులు
పెండింగ్‌లో 5.73 లక్షల దరఖాస్తులు
ఇప్పటికే సుమారు 5.73 లక్షల కుటుంబాలు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజా పాలనా కార్యక్రమం నిర్వహించగా సుమారు 24 లక్షల 74 వేల 325 కుటుంబాలు వివిధ పథకాల వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో అయిదు గ్యారంటీల కోసం సుమారు 19,01,256 కుటుంబాలు, రేషన్ కార్డు కోసం 5,73,069 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment