నిరుద్యోగ మైనార్టీ యువతకు నైపుణ్య శిక్షణ
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఆధ్యర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువతకు ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమాధికారి నవీన్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కోర్సులు నేర్పిస్తామన్నారు. ఇంటర్ ఆపై చదువుకున్న ఆసక్తిగల మైనార్టీ యువత తమ ఆధార్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఆదాయం సర్టిఫికెట్లతో పాటు ఫొటోలు హార్డ్ కాపీలతో ఈ నెల 31వ తేదీలోపు కలెక్టరేట్‌లోని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ప్రజా సమస్యలపై
రాజీలేని పోరాటం
కేశంపేట: గడపగడపకూ సీపీఐ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మండల కేంద్రంలో శుక్రవారం ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. వంద సంవత్సరాల కాలంలో పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొందని తెలిపారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలను కొనసాగించిందని గుర్తు చేశారు. అధికారం కోసం కాకుండా ప్రజ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిందన్నారు. అనంతరం పలువురికి పార్టీ సభ్యత్వాలను అందించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య, నాయకులు రాంచంద్రయ్య, పారేష, కమలమ్మ, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
కన్హాలో ముగిసిన జాతీయ సమైక్యతా సమ్మేళనం
నందిగామ: మండల పరిధిలోని కన్హా శాంతివనంలో నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా సమ్మేళనం 2024–25 కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా వికసిత్ భారత్, మహిళా సాధికారత, భారతదేశ సాంస్కృతిక వారసత్వం అనే అంశాలపై విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. శాసీ్త్రయ, జానపద సంగీతంతో పాటు ఆయా రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన కళలు, నృత్యాలు ప్రదర్శించారు. ఈ సమ్మేళనంలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు నవోదయ విద్యాలయ సమితి జాయింట్ సెక్రటరీ జ్ఞానేంద్ర కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ సమితి ఉప సంచాలకుడు గోపాలకృష్ణ, వివిధ రాష్ట్రాలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదిబట్ల మున్సిపాలిటీకి
చేంజ్‌మేకర్ అవార్డు
ఇబ్రహీంపట్నం రూరల్: స్వచ్ఛభారత్ మిషన్‌లో మెరుగైన ప్రదర్శనకుగాను ఆదిబట్ల మున్సిపాలిటీని చేంజ్ మేకర్స్ అవార్డు వరించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ పర్యావరణ ఇంజనీర్ సురేష్‌తో కలిసి సీఎస్‌ఈ డైరెక్టర్ డాక్టర్ సునీత నరైన్ చేతుల మీదుగా స్వీకరించారు. 2022–24 వరకు చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ప్రదర్శరన, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ఛ కార్యక్రమాలు, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ప్రతిభ కనబర్చిన మున్సిపాలిటీలకు ఈ అవార్డు అందజేస్తారు. అవార్డు రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని కమిషనర్ బాలకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment