సర్వే సెలవులు మంజూరు చేయాలని వినతి
షాద్‌నగర్‌రూరల్: గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్, సీసీఎల్ సెలవులను మంజూరు చేయాలని టీఎస్ యూటీఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు ఎంపీడీఓ బన్సీలాల్‌కు యూటీఎఫ్ నాయకలు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులు తమ సెలవులను కోల్పోయి ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా పాలుపంచుకొని సర్వేను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం నిర్ణయించిన రెమ్యూనరేషన్‌ను ఉపాధ్యాయుల ఖాతాలో జమ చేయడంతో పాటుగా సెలవు రోజుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు సీసీఎల్‌ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూటీఎఫ్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బిజిలి సత్యం, ఉపాధ్యక్షురాలు లక్ష్మిదేవమ్మ, నాయకులు అరుణ, కృష్ణ, బాలయ్య, వేణు, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మనవడికి లంచ్ బాక్స్ తీసుకెళ్లిన వృద్ధుడి అదృశ్యం
పహాడీషరీఫ్: మనవడికి లంచ్ బాక్స్ ఇచ్చేందుకు పాఠశాలకు వెళ్లిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాం కాలనీ నిత్య ఎన్‌క్లేవ్‌కు చెందిన బాబురావు బిరదర్(62) ఈ నెల 20న ఉదయం 11.55 గంటలకు స్థానికంగా ఉన్న శ్రీ చైతన్య హైస్కూల్‌లో చదివే మనవడికి లంచ్ బాక్స్ ఇచ్చేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. బాబురావు తొమ్మిది నెలల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. అతని కుమారుడు బిరదర్ అమోల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో లేదా, 87126 62367 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment