నీటి బిల్లు.. గుండెలు గుభేల్
పేదలకు పెను భారం
● ఒక్కో ఇంటిపై రూ.18వేల నుంచి రూ.20వేల వరకు బకాయి ● మాజీమంత్రి సబితారెడ్డిని ఆశ్రయించిన గాంధీనగర్ వాసులు ● సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ
బడంగ్‌పేట్: ముప్పై ఏళ్ల క్రితం ఉపాధి వెతుక్కుంటూ పొట్ట చేతబట్టుకుని పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి బడంగ్‌పేట్‌కు వలస వచ్చారు. మహాత్మా గాంధీజీ పేరుపెట్టుకుని గుడిసెలు వేసుకుని పొట్టకూటికి ప్రయాణం సాగించారు. అప్పట్లో గుడిసెలు కూల్చివేయడంతో ధర్నాలు, పోరాటాలు చేస్తూ గూడు కల్పించాలని ఆయా ప్రభుత్వాలను వేడుకోగా చలించిన నాటి ప్రభుత్వాలు ఇళ్లలేని పేద కుటుంబాలను గుర్తించి హుడా లేవుట్ చేసి ప్రతీ కుటుంబానికి 60 గజాల చొప్పున ఇంటి జాగలను లీగల్‌గా కేటాయించి సర్టిఫికెట్లను అందచేసింది. ఇప్పుడు గుడిసెల స్థానంలో రేకులు ఉన్నాయి. కానీ వీరికి హెచ్‌ఎండీఏ మెట్రో వాటర్ వారు నీటి బిల్లులు వేయడంతో ఆ బిల్లులు భారంగా మారాయి.
అప్‌గ్రేడ్ అయ్యాక అదనపు భారం
బడంగ్‌పేట కార్పొరేషన్ ఏర్పాటుకు ముందు 2013 వరకు బడంగ్‌పేట గ్రామ పంచాయతీ కొనసాగు తూ ఉండేది. అందులో గాంధీనగర్ ఒక స్లమ్ ఏరి యా. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యాక తాగునీటి సరఫరా బాధ్యత హెచ్‌ఎండీఏకు (మెట్రోవాటర్)కు అప్పగించారు. దీంతో బిల్లుల మోత మోగుతోంది. ఒక్కో ఇంటికి ఇప్పటి వరకు రూ.18 వేల నుంచి 20 వేల వరకు బిల్లులు రావడంతో గాంధీనగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ 800కు పైగా ఉన్న నివాసాలకు సుమారు రూ.1.50 కోట్లకు పైగా మెట్రో వాటర్ బిల్లులు బకాయిలు ఉన్నాయి. దీంతో మెట్రో వాట ర్ అధికారులు, సిబ్బంది నుంచి ఒత్తిడి పెరగడంతో వారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆశ్రయించారు. పాత మెట్రో బిల్లులు మాఫీ చేసేలా చూస్తే కొత్తగా వచ్చే బిల్లులు తగ్గిస్తే ప్రతీ నెల చెల్లించుకుంటామని ఇటీవల ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన సబితారెడ్డి మెట్రో ఉన్నతాధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పాత నల్లా బిల్లులు మాఫీ చేసి న్యాయం చేసేలా చూస్తానని గాంధీనగర్ వాసులకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment