బడుగుల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు
కడ్తాల్: బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి, వారి ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు తోడ్పాటునందించాలని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని కెనరా, యూనియన్, ఎస్‌బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్‌లతో కలిసి ఆయా సందర్శించారు. మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. బ్యాంకుల పరిధిలో ఎంఎస్‌ఎంఈ, కేవీఐసీ, ముద్ర, ఎన్‌ఐసీ, విశ్వకర్మ స్కీం, డెయిరీ, ఇటుక బట్టీల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, పచ్చళ్ల తయారీ, మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలు, స్వయం ఉపాధి పథకాల రుణాలు తదితర వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణకేంద్రాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే పార్లమెంట్ నియోజకవర్గంలో అతి పెద్ద లోన్ మేళా నిర్వహించనున్నామని, సుమారు రూ.4 నుంచి 5 వందల కోట్ల మేరకు వివిధ పథకాల కింద లబ్ధిదారులకు రుణాలు ఇవ్వనున్నామని ఆయన వెళ్లడించారు. బ్యాంకుల ఆవరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద అందజేస్తున్న రుణాల వివరాలను ప్రదర్శించాలని బ్యాంకర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, బ్యాంకు మేనేజర్లు విజయకుమార్, కమలాకర్, కిరణ్, రాజ్‌కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మయ్య, సింగిల్‌విండో డైరెక్టర్ శ్రీనివాస్, రవితదితరులు ఉన్నారు.
సంక్షేమ పథకాలపై
అవగాహన కల్పించాలి
నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి
బ్యాంకు మేనేజర్లతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment