పిల్లిది ప్రాణం కాదా..
చేవెళ్ల: ‘ప్రాణం ఎవరిదైనా ఒకటే.. పిల్లిది అయితే ప్రాణం కాదా.. అల్లారు ముద్దుగా ఐదునెలలుగా పెంచుకుంటున్నాం.. అది ఇప్పుడు ఇంట్లో లేదంటే ఎంతో బాధగా ఉంది.. ఏమీ తినడం లేదని ఆస్పత్రికి వస్తే ఏవో మందులు ఇచ్చి చంపేశారు’ అంటూ ఓ మహిళ కంటతడిపెట్టుకుంది. ఈ సంఘటన చేవెళ్లలో మంగళవారం చోటు చేసుకుంది. నగరానికి చెందిన పౌజియా బేగం పిల్లలతో కలిసి కొంతకాలంగా చేవెళ్లకు వచ్చి స్థిరపడింది. ఐదు నెలల కిత్రం ముచ్చటపడి పిల్లిపిల్లను తెచ్చుకుంది. ఇంటిల్లిపాదీ దానిని అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రెండు రోజులుగా అది ఏమీ తినకపోవడంతో చేవెళ్లలోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది ఇంజెక్షన్ ఇచ్చి, ఓ మందు తాగించి పంపించారు. ఇంటికి వెళ్లిన కాసేపటికి పిల్లి ఫిట్స్ వచ్చినట్లు కొట్టుకుంటూ అడ్డం పడిపోయింది. మళ్లీ ఆస్పత్రికి తీసుకురాగా వైద్య సిబ్బంది వైద్యం అందిస్తుండగా అది మృతి చెందింది. దీంతో పౌజియా బేగం, ఆమె కుమారుడు అక్బర్ సిబ్బందితో గొడవకు దిగారు. అల్లరుముద్దుగా పెంచుకుంటున్న పిల్లి వైద్యం వికటించి మృతి చెందిందని.. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. సరైన వైద్యం చేయకపోవడంతోనే పిల్లి చనిపోయిందని వైద్యం చేసిన సిబ్బందిపై ఫిర్యాదు చేశారు.
విచారణకు ఆదేశం
పిల్లికి అనారోగ్యంగా ఉండడంతో నయం చేసేందుకు వైద్యసిబ్బంది ప్రయత్నించారని చేవెళ్ల వెటర్నరీ వైద్యుడు తిరుపతిరెడ్డి తెలిపారు. ముందుగా వచ్చినప్పుడు ఆస్పత్రిలో ఉండే కాంట్రాక్ట్‌పై పనిచేసే సబార్డినేట్ దేవేందర్ నట్టల మందు, జ్వరం మందు వేసి పంపించాడని.. తరువాత మళ్లీ పరిస్థితి విషమంగా ఉందని రాగా చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు చెప్పారు. ఈ విషయంపై జేడీ విజయ్‌కుమార్‌కు సమాచారం అందించామని ఆయన ఆలూరు వైద్యులతో బుధవారం పోస్టుమార్టం చేయించాలని.. ఏం జరిగిందో విచా రణ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. కాగా తనపై దాడి చేశారని దేవేందర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అల్లారుముద్దుగా పెంచుకున్నాం..
తినడం లేదని ఆస్పత్రికి తెస్తే చంపేశారు
వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణం
ఆరోపించిన బాధితులు
పరస్పరం పోలీసులకు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment