నేడు చేవెళ్లలో మంత్రుల పర్యటన
చేవెళ్ల: మండలంలో బుధవారం మంత్రుల చేతల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండనున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మండలంలోని ముడిమ్యాల నుంచి రావులపల్లి, మెడిపల్లి మీదుగా ప్రొద్దటూరు గేట్ వరకు వేసే రోడ్డుకు శంకుస్థాపన, చేవెళ్ల మండల కేంద్రంలో పీఏసీఎస్ గోదాం, పీఏసీఎస్ కార్యాలయ భవనాల ప్రారంభోత్సవాలు ఉంటాయని పేర్కొంది. ఆయా కార్యక్రమాలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలిలో విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ఉంటుందని ప్రకటనలో తెలిపారు.
మైనార్టీ మహిళలకు
ఉచిత కుట్టు మిషన్లు
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నవీన్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నిరుపేద నిరాశ్రయులు, వితంతువు, విడాకులు తీసుకున్న మహిళలు అనాథ, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తెల్ల రేషన్‌కార్డు, ఆహారభద్రత కార్డు రెండు లేకపోతే గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షలు ఆదాయం మించకూడదన్నారు. వయస్సు 21 నుంచి 55 సంవత్సరాలు మించరాదన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా ప్రభుత్వ గుర్తింపుపొందిన సంస్థ ద్వారా నేర్చుకున్న టేలరింగ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. కనీసం 5వ తరగతి విద్యార్హత కలిగి ఉండలన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు మైనార్టీ క్రిస్టియన్ మహిళలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నిందితులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు
● పథకం ప్రకారమే నాగమణి హత్య
● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఇబ్రహీంపట్నం: కుట్రపూరిత పథకం ప్రకారమే కానిస్టేబుల్ నాగమణిని దారుణంగా హతమార్చారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆరోపించారు. రాయపోల్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నాగమణి కులాంతర వివాహం చేసుకుందన్న కక్షతో గత నెల 2న దారికాచి సొంత తమ్ముడే హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మంగళవారం రాయపోల్ గ్రామానికి చేరుకుని నాగమణి భర్త శ్రీకాంత్, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత సోదరుడే నాగమణిని హత్య చేయడం బాధాకరమని అన్నారు. హత్య కేసుతో సంబంధం ఉన్న వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను రెండు రోజుల్లో అరెస్టు చేయాలని రాచకొండ సీపీని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి భూమి, ఇల్లు ఇచ్చి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఏసీపీ కేపీవీ రాజు, తహసీల్దార్ సునీతరెడ్డి తదితరులు ఉన్నారు.
నిందితులను అరెస్టు చేయాలి
తుక్కుగూడ: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రాములపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పాఠశాలను సందర్శించి హెచ్‌ఎంను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు భద్రత లేకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు గోపాల్‌నాయక్, యాదయ్య, చైతన్య, శంకర్, కల్పన, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment