ఆరోగ్య ‘కుసుమ’ం
షాబాద్: నూనెగింజల సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు తెల్ల కుసుమకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్‌లో కుసుమ నూనెతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మండల పరిధిలోని రేగడిదోస్వాడ, ముద్దెంగూడ, ఏర్రోనిగూడ, తిర్మలాపూర్, బొబ్బిలిగామ, గోల్లూరుగూడలో 286 మంది అధిక దిగుబడినిచ్చే ఐఎస్‌ఎఫ్ 746 రకం కుసుమ విత్తనాలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. రబీ సీజన్‌లో ఈ పంట వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నాణ్యతలేని నకిలీ నూనెలు కుప్పలు తెప్పలుగా మార్కెట్లోకి వస్తున్న నేటి తరుణంలో వినియోగదారుడు ఏ వంట నూనెను నమ్ముకోవాలో తెలియని అయోమయ పరిస్ధితి నెలకొంది. గతంలో ఏ ఇంట చూసినా ఏడాదిపాటు అవసరమయ్యే తెల్లకుసుమన నూనెను నిల్వ ఉంచుకునేవారు. కానీ క్రమంగా సాగు తగ్గిపోవడంతో పరిస్థితి మారిపోయింది. తెల్లజొన్న, శనగ పంటలో తెల్లకుసుమను అంతర పంటగా సాగు చేసేవారు. అయితే పత్తిసాగు పెరగడం తెల్ల కుసుమ తగ్గింది. ఖరీఫ్‌లో సాగు చేస్తే పత్తి రబీ సీజన్ వరకూ దిగుబడి ఇస్తుండటంతో కుసుమ సాగుకు అవరోధం ఏర్పడుతోంది. దీనికి తోడు కుసుమ సాగుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు తెల్ల కుసుమకు రూ.6 వేలు పలుకుతోంది. వీటిని మర ఆడించి, తీసిన నూనెను కిలోకు రూ.450 చొప్పున విక్రయిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కుసుమ నూనె మార్కెట్‌లో లభించడం లేదు. దీంతో మిల్లుల వద్ద, లేదా రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కుసుమ ప్రాధాన్యం గుర్తిస్తున్న రైతులు ఈ పంట వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది.
పెరుగుతున్న తెల్లకుసుమ సాగు విస్తీర్ణం
అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం
అందించాలని రైతుల డిమాండ్
మూడేళ్లుగా సాగు
మూడేళ్లుగా తెల్ల కుసుమ సాగు చేస్తున్నాం. పొలంలో పండించిన కుసుమలను గానుగు ఆడించి, నిల్వ చేసి ఏడాది పొడవునా వినియోగిస్తాం. రుచికరమైన వంటలకు, ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలైనవి.
– కడుమూరు విఠలయ్య, తిర్మలాపూరం
ఆరోగ్యానికి మంచిది
రైతులు పండించిన నూనె గింజలను కొనుగోలు చేసి నూనె పట్టించుకోవాలి. గతంలో ఏడాది పొడవునా తెల్లకుసుమలను గానుగాడించే వారం. ప్రస్తుతం మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే కుసుమ నూనె పటిస్తారు.
– పర్వేద మల్లేశ్, రైతు బొబ్బిలిగామ
Comments
Please login to add a commentAdd a comment