వాటర్ బాటిల్ అనుకుని యాసిడ్ తాగి వ్యక్తి మృతి
మియాపూర్: వాటర్ బాటిల్ అనుకుని రోడ్డుపై పడి ఉన్న యాసిడ్ తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా, శెట్టి బలిజపేట గ్రామానికి చెందిన రాయుడు వెంకట సత్య సూర్యనారాయణ(41) కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాఫీజ్‌పేట్ మార్తాండ నగర్ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కూలి పనికి వెళ్లిన రాయుడు వెంకట సత్య సూర్యనారాయణ మధ్యాహ్నం ఇంటికి వస్తుండగా హాఫీజ్‌పేట్ రోడ్డు సమీపంలో రోడ్డుపై పడి ఉన్న బాటిల్ తీసుకుని నీళ్లు అనుకుని యాసిడ్ తాగాడు. ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే నోట్లో నుంచి రక్తం రావడంతో కుటుంబ సభ్యులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి రాయుడు గోవింద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని వ్యక్తికి
తీవ్ర గాయాలు
అమీర్‌పేట: ద్విచక్ర వాహనంపై త్రిబుల్ రైడ్ వచ్చిన యువకులు ముందు వెళ్తున్న బైక్‌ను ఢీ కొనడంతో ఓ విలేకరి తీవ్రంగా గాయపడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన రమేష్ (57) యూసుఫ్‌గూడలో ఉంటూ ఓ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. మంగళవారం అతను తన అల్లుడితో కలిసి వేర్వేరు బైక్‌లపై ఎస్‌ఆర్‌నగర్‌కు వచ్చారు. ఉమేష్ చంద్ర విగ్రహం నుంచి పాత పోలీస్‌స్టేషన్ వైపు వెళుతుండగా వెనక నుంచి త్రిబుల్ రైడ్‌తో వేగంగా వచ్చిన యువకులు రమేష్ బైక్‌ను ఢీకొట్టారు. అతను కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన యువకుల కోసం గాలిస్తున్నారు.
రెండు బైక్‌లు ఢీ
జీడిమెట్ల: యూటర్న్ తీసుకుంటున్న ద్విచక్రవాహనాన్ని మరో బైక్ ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతల్ గణేష్‌నగర్‌కు చెందిన మలిశెట్టి లక్ష్మివరమోహన్ కుమారుడు దేవహర్ష(26) గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరాడు. ఐడీపీఎల్ చౌరస్తా నుంచి కుత్బుల్లాపూర్ వైపు వస్తుండగా, అదే సమయంలో పద్మానగర్ ఫేజ్–2కు చెందిన పవన్‌రెడ్డి కుత్బుల్లాపూర్ చౌరస్తా వైపు వెళ్లేందుకు చింతల్ కేఎఫ్‌పీ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ఇద్దరి బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరూ ఎగిరి కింద పడటంతో వారి తలలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సూరారంలోని మల్లారెడ్డి అస్పత్రికి తరలిస్తుండగా దేవహర్ష మార్గమధ్యలోనే మృతి చెందాడు. పవన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని
యువకుడి దారుణ హత్య
కుషాయిగూడ: గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం చర్లపల్లి పీఎస్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ రవికుమార్ వివరాలిలా ఉన్నాయి. చర్లపల్లి, పుకట్‌నగర్ దారిలో ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెళ్లి వివరాలు సేకరించారు. 35ఏళ్ల యువకుడిని బండరాళ్లతో మోది హత్య చేసినట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. మృతుడు జార్ఘండ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవాడై ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
రైల్వే ట్రాక్‌పై మహిళ ఆత్మహత్యాయత్నం
రక్షించిన పోలీసులు
బాలానగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై సమాచారం అందడంతో సకాలంలో స్పందించిన పోలీసులు ఆమెను రక్షించారు. బాలానగర్ పీఎస్ పరిధిలోని రాజు కాలనీకి చెందిన మంగమ్మ (45) బుధవారం ఫిరోజ్‌గూడ ఎంఎంటీఎస్ రైల్వే ట్రాక్‌పై కూర్చుని ఆత్మహత్యకు యత్నిం చింది. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న కానిస్టేబుళ్లు రవీందర్, సుధాకర్‌రెడ్డి ఆమెను రక్షించారు. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment