బంజారాహిల్స్: ఇంటి తాళాలు పగులగొట్టి భారీగా నగదు, నగలు చోరీకి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2, ఇందిరానగర్‌లో నివసించే లోవకుమారి, వీర వెంకటరమణ దంపతులు కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 12న ఇంటికి తాళం వేసి రాజమండ్రికి వెళ్లారు. ఈ నెల 14న ఉదయం అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న కరుణాకర్ అనే వ్యక్తి మోటార్ ఆన్ చేసేందుకు కిందికి వచ్చి చూడగా లోవకుమారి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. తలుపు పక్కన కిటికీతో పాటు బీరువా ధ్వంసమై ఉండడమే కాకుండా వస్తువులన్నీ చెల్లాచెదురై ఉన్నాయి. దీంతో అతను వీర వెంకటరమణకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఆందోళనకు గురైన లోవకుమారి, వీర వెంకటరమణ సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు బీరువాను పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఇల్లు కొనుగోలు నిమిత్తం బీరువాలో దాచిన రూ.25 లక్షల నగదుతో పాటు 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ఆభరణాల్లో బంగారు హారం, గొలుసు, గాజులు, ఉంగరాలు, నెక్లెస్, పాపిడి బిళ్ల, బంగారు బిస్కెట్లు, చెవి రింగులు, లక్ష్మీ రూపులు, లక్ష్మీ రూపు విగ్రహం, వెండి పళ్లెం, పట్టీ గొలుసులు, వెండి గిన్నె ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇళ్లు తాళం వేసి ఉన్నట్లు గుర్తించిన దొంగలు పథకం ప్రకారం డోర్ పక్కన ఉన్న కిటికీ అద్దాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లే మార్గాలను తెలుసుకుని చోరీకి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ఒక మహిళ, ఒక యువకుడు సంచుల్లో ఆభరణాలు, డబ్బులు నింపుకుని వెళ్తున్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి. తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment