చెత్తను పీల్చే.. ‘జటాయు’
చెత్త కుప్పలు తొలగించే సరికొత్త యంత్రం
● ప్రయోగాత్మకంగా ఒక జోన్‌లో..
● పని తీరు బాగుంటే అదనంగా మరిన్ని అందుబాటులోకి..
● అద్దె ప్రాతిపదికన తీసుకోనున్న జీహెచ్‌ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మెరుగైన పారిశుద్ధ్యానికి పలు విధాలుగా చర్యలు చేపడుతున్న జీహెచ్‌ఎంసీ.. వాక్యూమ్ మెషిన్లను వినియోగించేందుకు సిద్ధమవుతోంది. సాధారణ స్వీపింగ్ మెషిన్‌లో దిగువన చీపుర్ల వంటి ఉపకరణాలు రోడ్లను శుభ్రం చేస్తే ‘జటాయు సూపర్’ అనే వాహనంలో ఉండే గొట్టం మాదిరి ఉపకరణం రోడ్లపై వ్యర్థాలన్నింటిని లాగి వాహనంలో పడవేస్తుంది. గొట్టాన్ని పట్టుకొని పారిశుద్ధ్య కార్మికుడు చెత్త కుప్పల వద్ద ఉంచితే చెత్తను మొత్తం పీల్చుతుంది. కాంటాక్ట్‌లెస్ ఫ్యాన్ టెక్నాలజీతో పని చేసే ఇది త్వరితంగా వ్యర్థాలను శుభ్రం చేయడంతో పాటు ఎలాంటి వాతావరణంలోనైనా వినియోగానికి అనువైనదని అధికారులు చెబుతున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఖైరతాబాద్‌జోన్‌లో ఒక మెషిన్‌ను వినియోగించి చూసి, ఫలితాన్ని బట్టి అదనపు మెషిన్లను అందుబాటులోకి తేనున్నట్లు జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్(పారిశుద్ధ్యం) ఎన్. రఘుప్రసాద్ తెలిపారు. ఈ వాహనాన్ని సమకూర్చుకున్న కాంట్రాక్టు ఏజెన్సీ గురువారం దీని పనితీరును ప్రదర్శించనుందన్నారు. పని తీరు బాగుంటే అద్దె ప్రాతిపదికన వినియోగించనున్నారు.
జటాయు సూపర్ ఏం చేస్తుంది?
ఇళ్లలోని దుమ్మూ ధూళిని శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్ లాంటి మెషిన్ జటాయు సూపర్. ఇది రోడ్లపై చెత్తను, చిన్నచిన్న రాళ్లను మాత్రమే కాకుండా గుట్టలుగా పోగుపడ్డ అన్ని రకాల చెత్తను పైప్ వంటి ఉపకరణంతో గుంజుకొని శుభ్రం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. స్వీపింగ్ మెషిన్ లాంటిదే జటాయు సూపర్ కూడా. ఇందులో ఉండే శక్తిమంతమైన సక్షన్ పంపులు చెత్తను గొట్టంలోకి గుంజుతాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా, తడి పొడి చెత్తను సైతం గుంజుతుందని అధికారులు పేర్కొన్నారు. చెత్తలో ఉండే కొబ్బరిచిప్పలు, పగిలిన గ్లాసులు, సీసాలు, ఆకులు, కాగితాల వంటి అన్ని రకాల చెత్తను సక్షన్ పవర్‌తో లాగేస్తుందని తెలిపారు. క్లీన్ చేశాక నేలపై ఎలాంటి చెత్త, రాళ్లవంటివి కూడా కనిపించవు అని చెబుతున్నారు.
పారిశుద్ధ్యానికా.. ప్రైవేటు ఏజెన్సీల కోసమా ?
పారిశుద్ధ్యం కోసం కొత్త సాంకేతికతతో కూడిన జటాయు సూపర్‌ను పరిశీలించనున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రైవేటు కాంట్రాక్టు ఏజెన్సీల ప్రయోజనం కోసమే వీటిని తెచ్చే యోచన చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పర్యాటక ప్రాంతాలు, వీఐపీ మార్గాలు పేరిట పారిశుద్ధ్య నిర్వహణకు అంటూ ప్రైవేటు ఏజెన్సీలకు భారీ మొత్తంలో నిధులు ధార పోస్తున్నారనే విమర్శలున్నాయి. ఆ మార్గాల్లో పారిశుద్ధ్యం ఏమాత్రం మెరుగుపడకపోయినా, అదనపు చెల్లింపుల వెనుక ఆమ్యామ్యాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మెషిన్ల పేరిట మరో కొత్త ఎత్తుగడ వేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment